
ప్రభుత్వరంగంలోని అతి పెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసి చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా సునీల్ అగర్వాల్ నియమితులయ్యారు. ఇంతకుముందు ఆయన రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఈ కంపెనీలో 12 ఏళ్ల పాటు సీఎఫ్‌ఓగా బాధ్యతలు చూశారు. అలాగే, ఐదేళ్లు ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పనిచేశారు. ఓ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన వ్యక్తికి ఎల్‌ఐసీలోనిఅత్యునుత హోదాల్లో ఒక్కటైన సీఎఫ్‌ఓ అవకాశం కల్పించడం గమనార్హం.
కోట్లాదిమంది ఎదురు చూస్తున్నారు ఎల్ఐసీ ఐపీవో కోసం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీవో రావాల్సి ఉన్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రాక ఆలస్యమవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది రానుంది. ఎల్ఐసీ ఐపీవోకు అనుగుణంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా తమ ముఖ్య ఆర్థిక అధికారి(CFO)గా రిలయన్స్-నిప్పోన్ లైఫ్ ఇన్సురెన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన సునీల్ అగర్వాల్‌ను నియమించింది.
బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు చెబుతున్నారు. CFOను బయటి నుండి నియమించుకోవడం ఎల్ఐసీకి ఇది మొదటిసారి. ఈయనకు ముందు ఎల్ఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శుభాంగి సంజయ్ సోమన్ సీఎఫ్ఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎల్ఐసీ గత సెప్టెంబర్ నెలలో సీఎఫ్ఓ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుందని, వార్షిక వేతనం రూ.75 లక్షలు అందిస్తామని పేర్కొంది. ఈ నియామకం మూడేళ్ల పాటు ఉంటుంది లేదా అభ్యర్థికి 63 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉంటుంది. మూడేళ్ల పదవీ కాలానికి గాను అగర్వాల్ సీఎఫ్‌ఓగా కొనసాగనునాురు. ఏడాదికి రూ.75 లక్షల వేతనం చెల్లించనున్నారు.
తొలుత ఎల్ఐసీలో 10 శాతం వాటా విక్రయంతో రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించగా.. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత 5 శాతం విక్రయానికే పరిమితం కావాలని నిర్ణయించింది. దీంతో రూ.50,000-60,000 కోట్ల వరకు సమీకరించాలనుకుంది. ఇప్పుడు వాయిదా వేసేట్టు అయితే.. తదుపరి ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వాటా విక్రయానికి మొగ్గు చూపిస్తుందేమో చూడాలి.