‘నిక్కీ’ సుపీరియర్ ఫోన్‌గా ‘జియో’కు పురస్కారం

By rajesh yFirst Published Jan 5, 2019, 10:28 AM IST
Highlights

అత్యంత చౌకగా వినియోగదారులకు ప్రత్యేకించి గ్రామీణులకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఫీచర్ ఫోన్‌గా రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ పేరు తెచ్చుకున్నది. తత్ఫలితంగా 2018 సంవత్సరానికి సుపీరియర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవార్డును అందుకున్నది జియో.

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ జియో ఆవిష్కరించిన చౌక ఫీచర్‌ఫోన్‌ ‘జియోఫోన్‌’ ఒక ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నది. రూ.49కే అపరిమిత కాల్స్‌తోపాటు అపరిమిత డేటా వినియోగించుకునే వీలు గల ఈ ఫోన్‌కు ‘నిక్కీ సుపీరియర్‌ ప్రోడక్ట్స్‌ అండ్‌ సర్వీసెస్‌ అవార్డు -2018’ లభించింది. తక్కువ ఆదాయం కల వారూ ఇంటర్నెట్‌ వినియోగించుకునే అవకాశాన్ని జియో ఫోన్‌ కల్పించిందని, జపాన్‌ పబ్లిషింగ్‌ సంస్థ నిక్కీ ప్రశంసించింది. మెరుగైన వినూత్న ఉత్పత్తులు, సేవలతో పాటు భవిష్యత్ తరాలకు అవసరమైన సాంకేతికతలను అందించే యత్నాలకు ఈ అవార్డు లభించినట్లు నిక్కీ పేర్కొంది.

అత్యంత చవకగా గ్రామీణులకు నెట్‌ సేవలు 
‘2016 సెప్టెంబర్ నెలలో ఉచిత కాల్స్‌, డేటాతో మొబైల్‌ 4జీ సేవలకు శ్రీకారం చుట్టిన ముకేశ్‌ అంబానీ, డేటా సేవలు లభించే జియోఫోన్‌ను రూ.1,500 రిఫండబుల్‌ డిపాజిట్‌తో ఏడాది తరవాత మార్కెట్లోకి తెచ్చారు. దేశీయ టెలికాం రంగ తీరును సమూలంగా మార్చేసిన సంస్థగా రిలయన్స్‌ జియో పేరొందింది. అతిచౌక ధరలతోనే, దేశీయ టెలికాం రంగంలో స్థిరీకరణకు ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. అంతేకాదు జియోఫోన్‌ మరింత విధ్వంసకారిగా అవతరించింది. గ్రామీణులకు కారుచౌకగా నెట్‌ సేవలు అందిస్తోంది’అని నిక్కీ ప్రశంసించింది. 2018 జులైకి రిలయన్స్‌ జియో కనెక్షన్లు 25 కోట్లు దాటాయని తెలిపింది.

నిక్కీ అవార్డు ఎంపిక ఇలా 
1982 నుంచి ఏటా, సరికొత్త నాణ్యమైన ఉత్పత్తులు, సేవలకు నిక్కీ సుపీరియర్‌ ప్రోడక్ట్స్‌ అండ్‌ సర్వీసెస్‌ అవార్డ్స్‌ అందిస్తోంది. ఇందుకు దరఖాస్తులేమీ కోరరు. నిక్కీ ప్రచురణల్లో వచ్చిన 20,000 ఉత్పత్తులు, సేవల నుంచీ ఎంపిక చేస్తుంది. సాంకేతికత అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు, ధర ప్రభావం, వ్యాపారంలో వాటా, వృద్ధికి అవకాశాలు, ప్రత్యేకతలు, వాణిజ్య-సామాజిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని నిక్కీ ఈ అవార్డును ఎంపిక చేయనున్నది.
 

click me!