పెరిగిన ‘జియో’సబ్‌స్క్రైబర్లు: రిలయన్స్‌లోకి మరో వారసుడు

By sivanagaprasad kodatiFirst Published Jan 20, 2019, 11:12 AM IST
Highlights

2018 నవంబర్ నెలాఖరు నాటికి రిలయన్స్ జియోకు అదనపు సబ్‌స్క్రైబర్లు జత కలిశారు. దీంతో రిలయన్స్ చందాదారుల సంఖ్య 27.16 లక్షల మందికి చేరింది. తర్వాత బీఎస్ఎన్ఎల్ అదనంగా 3.78 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పొందగలిగింది.

అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ టెలికం రంగంలోనే సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్‌ జియో కొత్త చందాదారుల పొందే విషయంలోను అగ్రస్థానంలోనే నిలిచింది. 2018 నవంబరు నెలలో జియోకు 88.01లక్షల మంది చందాదారులు అదనంగా చేరారు. దీంతో నవంబర్ నెలాఖరు నాటికి రిలయన్స్‌ జియోకు మొత్తం 27.16లక్షల మంది చందాదారులు ఉన్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) తెలిపింది.

రెండోస్థానంలో బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్లు
ట్రాయ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం అదనపు చందాదారులు పొందడంలో జియో అగ్రస్థానంలో ఉండగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ రెండో స్థానంలో ఉంది. నవంబర్ నెలాఖరు నాటికి దేశంలో మొత్తం 117.18కోట్ల మంది మొబైల్‌ ఫోన్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌కు అదనంగా 3.78లక్షల మంది చందాదారులు జత కలిశారు. భారతీయ ఎయిర్‌టెల్‌కు 1.02లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. 

డౌన్‌లోడ్ స్పీడ్ తగ్గినా జియోదే పైచేయి
2018 డిసెంబర్ నెలలో డౌన్‌లోడ్‌ స్పీడ్ తగ్గినా ఆ జాబితాలో జియో అగ్రస్థానంలోనే కొనసాగుతోందని ట్రాయ్‌ ఇటీవల బయటపెట్టిన విషయం తెలిసిందే. డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 8శాతం తగ్గి 18.7ఎంబీపీఎస్‌గా నమోదైందని ట్రాయ్‌ వెల్లడించింది. 12 నెలలుగా జియోనే అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

‘రిలయన్స్’లోకి అంబానీ తనయుడు అన్షూల్
రిలయన్స్‌ గ్రూపులోకి అంబానీల మరో వారసుడు అడుగుపెట్టాడు. అనిల్‌ అంబానీ చిన్న కుమారుడు అన్షూల్‌ అంబానీ ( 23) సంస్థలోకి అడుగు పెట్టినట్లు రిలయన్స్‌ గ్రూపు తెలిపింది. న్యూయార్క్‌లోని స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో మేనేజ్‌మెంట్‌ యూజీ పట్టా పొందిన అనంతరం అన్షూల్‌ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాలో మేనేజ్‌ మెంట్‌ ట్రైనీగా చేరారని సంస్థ శనివారం తెలిపింది. 

ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ నిర్వహిస్తున్న రిలయన్స్ ఇన్ ఫ్రా
రిలయన్స్‌ గ్రూపు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రిలయన్స్‌ గ్రూపునకు చెందిన విద్యుత్ ఉత్పత్తి, ముంబై లాంటి మెట్రో నగరాలలో విద్యుత్ పంపిణీ, రిలయన్స్‌ డెఫెన్స్‌, రిలయన్స్‌ రోడ్స్‌ అండ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ తదితర వ్యాపారాలకు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా హౌల్డింగ్‌ కంపెనీగా వ్యవహరిస్తోంది. 

రిలయన్స్ విదేశీ ఆర్థిక సేవల విభాగంలో అన్మోల్
అనిల్‌ అంబానీ పెద్ద కుమారుడు కూడా అన్మోల్‌ కూడా 2014లో చదుపు పూర్తి చేసుకుని తొలుత రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో ట్రైనీగానే గ్రూపులో తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. రిలయన్స్‌ క్యాపిటల్‌లో చేరారు. ప్రస్తుతం అన్మోల్‌ రిలయన్స్‌ గ్రూపునకు చెందిన విదేశీ ఆర్థిక సేవల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
 

click me!