ప్రైవేటీకరణ యోచన పొరపాటే! జెట్ క్రైసిస్‌పై ఎయిరిండియా

By rajashekhar garrepallyFirst Published Apr 22, 2019, 12:11 PM IST
Highlights

జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభంతో ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి ఎంత మాత్రం కాదని తేలిపోయిందని ఎయిరిండియా ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రభుత్వ అంచనాల స్థాయికి దేశీయ విమానయాన రంగం ఎదగలేదని స్పష్టం చేశాయి.

న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ వల్ల విమానయాన సంస్థ లాభదాయకంగా మారుతుందని, సంస్థ సామర్థ్యం పెరుగుతుందని, సర్వరోగ నివారిణి అని భావించడం పొరపాటని ఎయిరిండియా ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. దేశీయంగా ప్రైవేట్ రంగంలోని పెద్ద సంస్థలైన కింగ్‌ఫిషర్‌, జెట్ ఎయిర్‌వేస్‌ ఉదంతాలను చూశాక కూడా, ఎయిరిండియాను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావించడం సరికాదని చెబుతున్నారు.

ప్రభుత్వ విధానాల వల్లే విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడుతోందని, వేలమంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. 2012లో మూతబడిన కింగ్‌ఫిషర్‌తో పాటు జెట్ ఎయిర్‌వేస్‌కు కూడా ప్రభుత్వరంగ బ్యాంకులే రూ.వేలకోట్ల రుణాలిచ్చాయని, అవి వసూలు చేసుకోవడమూ సవాలేనని ఎయిర్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏసీఈయూ) సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

2040 నాటికి విమాన ప్రయాణికుల సంఖ్య ఏడాదికి 110 కోట్లకు చేరేలా చూడాలన్నది ప్రభుత్వ అంచనా. ప్రైవేటురంగ సంస్థల వల్లే ఈ లక్ష్యాన్ని చేరవచ్చని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ప్రభుత్వ అంచనాల స్థాయిలో పరిశ్రమ లేదని, అంతటి గణనీయ వృద్ధి సుస్థిరం కాలేదని గుర్తు చేశారు.

జెట్ ఎయిర్‌వేస్‌ విమానాలు రద్దయినందున, ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో నిలిచిపోయిన ప్రయాణికులను కూడా గమ్యానికి చేర్చే బాధ్యతను ఎయిరిండియానే స్వీకరించిందని, ఇందుకోసం ప్రత్యేక ఛార్జీలను కూడా అమలు చేసిందని గుర్తు చేశారు. మరే ప్రైవేట్ విమానయాన సంస్థ నుంచి ఇలాంటి సుహృద్భావ చర్యలు ఆశించలేమని అన్నారు. 

ప్రస్తుత పరిస్థితులు కొనసాగేందుకు అనుమతిస్తే, భవిష్యత్తులో మరిన్ని సంస్థలు మూతబడి ఉద్యోగులు, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలని, అందరికీ అవకాశాలు ఇవ్వడంపై పునరాలోచించాలని కోరారు.

ఇదిలా ఉంటే ఒకవేళ బిడ్డింగ్‌ ప్రక్రియ విఫలమైనా, జెట్ ఎయిర్‌వేస్‌ నుంచి బకాయిలు వసూలు చేసుకునేందుకు, దివాలా స్మృతి ప్రక్రియ అమలుకాకుండా చూడాలన్నదే బ్యాంకర్ల అభిప్రాయం. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకర్ల కన్సార్టియం నిర్వహిస్తున్న బిడ్డింగ్‌లో ఎంపికైన సంస్థలు వచ్చేనెల 10వ తేదీకల్లా తుది బిడ్లు సమర్పించాల్సి ఉంది. 

ఒకవేళ బిడ్ల ప్రక్రియ విజయవంతం కాకపోతే, ఏం చేయాలో కూడా బ్యాంకర్లు యోచిస్తున్నట్లు సమాచారం. దివాలా స్మృతి బయటే పరిష్కారానికి ప్రయత్నించాలని, ఇందుకోసం జెట్‌ కొనుగోలు చేసిన 16 విమానాలు, ఇతర ప్రత్యక్ష ఆస్తులను వినియోగించుకోవాలన్నది వారి ప్రణాళికలో భాగంగా ఉన్నదని చెబుతున్నారు.

click me!