జెట్ ఎయిర్వేస్‌కు లైన్ క్లియర్: వాటాదారులు ఒకే... ఇక బ్యాంకుల కంట్రోల్

By rajesh yFirst Published Feb 23, 2019, 12:32 PM IST
Highlights

రుణాలిచ్చిన బ్యాంకర్లకు రుణాలను ఈక్విటీలుగా మార్చాలని చేసిన ప్రతిపాదనకు‘జెట్‌ ఎయిర్వేస్’షేర్‌హోల్డర్లు క్లియరెన్స్‌ ఇచ్చారు. తత్ఫలితంగా జెట్ ఎయిర్వేస్ యాజమాన్య నియంత్రణ బ్యాంకుల చేతుల్లోకి వెళ్లనున్నది.

న్యూఢిల్లీ: కష్టాల రన్‌వేపై ల్యాండ్‌ అయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ తిరిగి ‘టేకాఫ్’ తీసుకునేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. అందుకు షేర్‌హోల్డర్లు క్లియరెన్స్‌ ఇచ్చారు. రుణదాతల బకాయిలను ఈక్విటీగా బదలాయించే ప్రతిపాదనకు షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. 

ఈ - ఓటింగ్‌లో వాటాదారుల ఆమోదం 
గురువారం నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనపై జరిగిన ఈ-ఓటింగ్‌లో బాకీలను ఈక్విటీగా బదలాయించడంతోపాటు కంపెనీ ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ (ఏఓఏ), మెమోరాండం ఆఫ్‌ అసోసియేషన్‌లోనూ మార్పులు చేసేందుకు షేర్‌హోల్డర్లు అంగీకారం తెలిపారు. ఈజీఎంలో జెట్‌ యాజమాన్యం మొత్తం ఐదు ప్రతిపాదనలను షేర్‌హోల్డర్ల ముందు ఉంచింది.

ఇక బ్యాంకుల కన్సార్టియానికి షేర్ల కేటాయింపు
బ్యాంకుల కన్సార్షియానికి షేర్లు కేటాయించేందుకు 98 శాతం షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారని స్టాక్‌ ఎక్స్చేంజీలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ సమాచారం అందించింది. ఈజీఎంకు జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపక ప్రమోటర్‌, చైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ మాత్రం హాజరుకాలేదు. 40 నిమిషాలపాటు సాగిన ఈ భేటీకి కంపెనీ బోర్డు పర్మినెంట్ డైరెక్టర్‌ గౌరంగ్‌ శెట్టి అధ్యక్షత వహించారు.

‘జెట్‌’కు రూ.500 కోట్ల నిధులు!
నిధుల కొరతతో సతమతం అవుతున్న జెట్‌ ఎయిర్‌వే్‌సకు త్వరలో కొంత ఊరట లభించే అవకాశం ఉంది. కంపెనీ రూ.500 కోట్ల తాత్కాలిక నిధులు సమకూర్చాలని బ్యాంక్‌ల కన్సార్షియం భావిస్తోందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ) ఎండీ సునీల్‌ మెహతా తెలిపారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ‘కంపెనీ ఇంకా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కాబట్టి దాని విలువను సంరక్షించేందుకు వ్యాపార నిర్వహణ అవసరాల కోసం నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు సానుకూలంగానే ఉన్నాయి’ అని మెహతా పేర్కొన్నారు.

గత డిసెంబర్ నాటికి జెట్ ఎయిర్ వేస్ రుణం రూ.7,299 కోట్లు
గత ఏడాది చివరినాటికి జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ భారం రూ.7,299 కోట్లుగా నమోదైంది. ఎస్బీఐ నేతృత్వంలో కొన్ని బ్యాంక్‌లు కన్సార్షియంగా ఏర్పడి గతంలో జెట్‌ ఎయిర్‌వేస్ సంస్థకు వేల కోట్లలో రుణాలిచ్చాయి. ఆ కన్సార్షియంలో పీఎన్బీ కూడా ఉంది. వ్యాపార నిర్వహణ అవసరాల నిమిత్తం మూలధన నిధులు సేకరించడంతోపాటు రుణాలను పునర్వ్యవస్థీకరణకు జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యం ప్రయత్నిస్తోంది.
 

click me!