నరేశ్ గోయల్ గైర్హాజర్: నిరాశ మిగిల్చిన జెట్ ఎయిర్వేస్

By rajesh yFirst Published Feb 22, 2019, 2:18 PM IST
Highlights

జెట్ ఎయిర్వేస్ సంస్థ యాజమాన్యం పునరుద్ధరణ ప్రణాళికలపై విమానాల యజమానులు పెదవివిరిచారు. దీంతో తమ విమాన సర్వీసులను వెనుకకు తీసుకుంటున్నారు. మరోవైపు బ్యాంకర్లు ఇచ్చిన రుణాలను ఈక్విటీ షేర్లుగా తీసుకునే ప్రక్రియను తప్పనిసరి పరిస్థితుల్లోనూ అంగీకరించినట్లు తెలుస్తున్నది. 

సింగపూర్/ బెంగళూరు: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌.. దాని నుంచి ఎలాగోలా గట్టెక్కేందుకు గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం నిరాశే మిగిల్చింది. ఈ సమావేశం ద్వారా కంపెనీ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై ఎంతో కొంత స్పష్టత వస్తుందేమోనని ఆశించిన వాటాదార్లకు నిరాశే మిగిలిందనే అభిప్రాయం వినిపిస్తోంది.

రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక పూర్తి వివరాలు వెల్లడించకపోగా.. మరిన్ని కొత్త సందేహాలు రేకెత్తేలా సమావేశం సాగిందని కొందరు మైనార్టీ వాటాదారులు చెప్పారు. కంపెనీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై స్పష్టత కూడా ఇవ్వలేదని తెలిపారు. ప్రధానంగా రుణాలను షేర్లగా మార్చుకోవడం, బోర్డు పునర్‌వ్యవస్థీకరణ అంశం చుట్టే సమావేశం సాగినట్లు తెలుస్తోంది.

రుణ పునర్‌వ్యవస్థీకరణ, నిధుల సమీకరణకు ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అసాధారణ సర్వసభ్య సమావేశానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌, ఛైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ హాజరు కాకపోవడం గమనార్హం. 

కంపెనీ పూర్తికాల డైరెక్టర్‌ గౌరంగ్‌ శెట్టి నేతృత్వంలో దాదాపు 40 నిమిషాలు ఈ సమావేశం జరిగింది. పెట్టుబడి సాయం నిమిత్తం వివిధ పెట్టుబడి సంస్థలతో కంపెనీ సంప్రదింపులు నిర్వహిస్తోందని వాటాదార్లకు ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు. 

వాటాదార్లకు పంపిన నోటీసు ప్రకారం.. రుణాన్ని షేర్లు లేదా కన్వర్టబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ లేదా ఇతర సెక్యూరిటీలు మార్పిడి చేసే ప్రతిపాదనకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. రుణదాతల నుంచి మరిన్ని రుణాల సమీకరణ నిమిత్తం తుది షరతులను ఖరారు చేయడంపై చర్చించాలనే మరో ప్రతిపాదనను కూడా ఇందులో పొందుపరిచారు. 

ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా జెట్ ఎయిర్వేస్ సంస్థకు విమానాలను లీజుకు ఇచ్చిన సంస్థలు వాటిని గ్రౌండ్‌కే పరిమితం చేశాయి. గత నెలలో గ్రౌండ్‌కు పరిమితమైన నాలుగు విమాన సర్వీసులు ఈ నెల తొమ్మిదికి చేరాయి. 2012 నాటి కింగ్ ఫిషర్ రుణ వాయిదాల చెల్లింపుల్లో వైఫల్యం నాటి పరిస్థితులను వారు గుర్తు చేసుకుంటున్నారు. కింగ్ ఫిషర్ మాదిరిగానే జెట్ ఎయిర్వేస్ సంస్థ కూడా కొన్ని నెలలుగా సిబ్బంది వేతనాలు సకాలంలో చెల్లించడం లేదు. 

బ్యాంకులు రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక పట్ల కన్విన్స్ కాకున్నా.. కింగ్ ఫిషర్ మాదిరిగా పరిస్థితి మారవద్దన్నదే తమ అభిమతం అని బ్యాంకర్లు చెబుతున్నారు. కానీ మెజారిటీ వాటాలను కొనుగోలు చేసేందుకు కూడా బ్యాంకర్లు సిద్ధంగా లేరు. బ్యాంకుల రుణ పునర్వ్యవస్థీకరణ పథకం పేరుతో అదనంగా షేర్లు స్రుష్టించాల్సి ఉన్నది. 123 బోయింగ్, 16 సొంత విమానాలు గల జెట్ ఎయిర్వేస్ మేనేజ్మెంట్ టీం.. ప్రస్తుత బెయిలౌట్ ప్యాకేజీ ఖరారు కావడానికి నిర్ధిష్ట గడువేమీ లేదని తెలిపింది.  

ప్రయాణికులకు జెట్ ఎయిర్వేస్ 50% ఆఫర్ ఇలా
జెట్‌ ఎయిర్‌వేస్‌ టికెట్‌ ధరపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ నెల 20 నుంచి 25 వరకు బుకింగ్‌ చేసుకునే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఎకానమీ క్లాస్‌కైతే 2019 మార్చి 8 నుంచి, ప్రీమియర్‌ క్లాస్‌కైతే 2019 మార్చి 1 నుంచి దేశం లోపల చేసే ప్రయాణాలపై ఆఫర్‌ను పొందొచ్చు. అంతర్జాతీయ ప్రయాణాలకైతే తక్షణమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. లండన్‌ హీత్రో విమానాశ్రయం నుంచి కోడ్‌షేర్‌ ద్వారా తన భాగస్వామి సంస్థల విమానాల్లో చేసే ప్రయాణాలకు కూడా ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. బార్సెలోనా, బుదాపెస్ట్‌, కోపెన్‌హాగన్‌, గ్లాస్గో, ఎడిన్‌బర్గ్‌, మిలాన్‌, ఓస్లో, రోమ్‌, ప్రేగ్‌, జ్యూరిచ్‌ ఇలా ఐరోపాలోని అత్యుత్తమ ప్రాంతాలను సందర్శించేందుకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది.

click me!