నరేశ్ గోయల్‌పైనే డౌట్?‘జెట్‌’ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌: ఎస్బీఐ

By rajesh yFirst Published Dec 15, 2018, 11:17 AM IST
Highlights

జెట్ ఎయిర్వేస్ అధినేత నరేశ్ గోయల్ వ్యవహారశైలిపైనే అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్ది నెలలుగా నిధుల కొరతతో సిబ్బంది వేతనాలు చెల్లించలేని స్థితిలో జెట్ ఎయిర్వేస్ ఉంది. ఈ క్రమంలో అసలు 2004 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకు జెట్ ఎయిర్వేస్ లావాదేవీలపై ఫోరెన్సిక్ అడిటింగ్ జరుపాలని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థను ఎస్బీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.

ముంబై: కొద్ది నెలలుగా ఆర్థిక సమస్యలు, నగదు సంక్షోభంలో అల్లాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2014 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి నెలల మధ్య కాలంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ పద్దులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని లీడ్‌ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆదేశించింది. ఈ సంస్థకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం రూ. 8200 కోట్ల రుణాలు ఇచ్చింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పద్దులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఇ అండ్‌ వై) సంస్థను ఎస్‌బీఐ ఆదేశించిందని, ఇప్పటికే ఆ సంస్థ పని ప్రారంభించిందని బ్యాంకు వర్గాలు తెలిపాయి.

మూడు వరుస త్రైమాసికాల్లో రూ.1,000 కోట్లకు పైగా నష్టం నమోదు చేసి తీవ్ర సంక్షోభంలో పడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుత నిధుల సమస్యను గట్టెక్కేందుకు పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఎస్బీఐ ప్రతినిధి ఒకరు ఈ పరిణామం గురించి మాట్లాడడానికి నిరాకరించారు. వ్యక్తిగత ఖాతాలపై వ్యాఖ్యలు చేయకూడదన్నది బ్యాంకు విధానమని స్పష్టం చేశారు. ఇ అండ్‌ వై కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. జెట్ ఎయిర్ వేస్ కూడా దీనిపై ప్రతిస్పందించలేదు.
జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయంటూ గుప్త సమాచార వాహకుడొకరు అందించిన సమాచారం మేరకు బ్యాంకు ఈ ఆడిట్‌ నిర్ణయం తీసుకున్నదని బ్యాంకు వర్గాలు తెలిపాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన పద్దు పుస్తకాలు, ఇతర పత్రాల తనిఖీకి ప్రభుత్వం ఈ ఆగస్టులోనే ఆదేశించిన విషయం విదితమే. ఇంకా ఆ తనిఖీ ఫలితం వెల్లడి కావలసి ఉంది. 


ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి జెట్‌పై రూ.8052 కోట్ల  రుణభారం ఉంది. మూడు వరుస త్రైమాసికాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టాన్ని నమోదు చేయటంతో కొన్ని నెలలుగా సిబ్బందికి వేతనాలు చెల్లించడానికే జెట్ ఎయిర్‌వేస్ అల్లాడిపోవలసిన పరిస్థితి నెలకొంది. కాగా కంపెనీ ప్రమోటర్‌ నరేశ్‌ గోయెల్‌ రూ.5 వేల కోట్లకు పైగా నిధులు స్వాహా చేశారని ఆరోపణలున్నాయి.

జెట్‌ ఎయిర్‌వేస్ సంస్థలో గల్ఫ్‌కు చెందిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 24 శాతం వాటాలు ఉన్నాయి. మరో 25 శాతం వాటాల విక్రయానికి ఎతిహాద్‌తో సహా పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జోరుగా సాగుతున్నాయి. భారతదేశానికి చెందిన టాటా సన్స్ గ్రూప్‌తో జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. 

click me!