జీవితం?: జాక్ మా ‘996’ పనిగంటలపై విమర్శల వర్షం

By rajesh yFirst Published Apr 13, 2019, 5:45 PM IST
Highlights

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ ఛైర్మన్ జాక్ మా   పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆలీబాబా గ్రూప్‌లో మీరు కొనసాగాలంటే వారంలో ఆరు రోజులపాటు రోజుకు 12గంటల చొప్పున పనిచేయాలని జాక్ మా వ్యాఖ్యానించారు.

బీజింగ్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ ఛైర్మన్ జాక్ మా   పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆలీబాబా గ్రూప్‌లో మీరు కొనసాగాలంటే వారంలో ఆరు రోజులపాటు రోజుకు 12గంటల చొప్పున పనిచేయాలని జాక్ మా వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన కంపెనీ అంతర్గత సమావేశంలో జాక్ మా సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, 8గంటలు పనిచేసే ఉద్యోగులు కంపెనీకి అవసరం లేదని, ఆ సంస్కృతి పోవాలని ఆలీబాబా అధికారిక వైబో అకౌంట్‌లోనూ ఆయన పోస్టు చేశారు.

అన్ని చోట్లా అందరూ ‘996’ పని సంస్కృతి అలవాటు చేసుకోవాలని.. అలా పనిచేయడం అదృష్టంగా భావించాలని సెలవిచ్చారు ఈ చైనా ధనవంతుడు. అంటే అందరూ ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ.. వారంలో ఆరు రోజులూ పని చేయాలన్నది జాక్ మా ఉద్దేశం అన్నమాట.

ఆలీబాబా గ్రూప్‌లో మీరు ఉద్యోగంలో చేరాలనుకుంటే 12గంటలపాటు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని జాక్ మా స్పష్టం చేశారు. అయితే, అదనపు పనిగంటలకు ఎక్కువ జీతం ఇవ్వాలో లేదో నిర్ణయించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. 

కాగా, జాక్ మా వ్యాఖ్యలపై చైనాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్‌మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీల్లో అత్యధిక పనిగంటలు చేస్తున్న అనేకమంది ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

జాక్ మా పనిగంటల కల్చర్ కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాక్ మా 996 పనిచేస్తే ఆయన సంపద పెరుగుతుంది కాబట్టి ఆయన చేసుకోవచ్చని.. ఉద్యోగులు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ‘996=ఐసీయూ’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. జాక్ మా కంపెనీలో పనిచేస్తే.. పని, జీతం ఉంటుంది కానీ.. జీవితం ఉండదని ఎద్దేవా చేస్తున్నారు.

click me!