
ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ రోజు రోజుకి మరింత కష్టాల్లో చిక్కుకుంటున్నారు. మరోసారి చిత్రా రామకృష్ణ నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ఆదాయపన్ను, సెబీ సంస్థల విచారణలో చిత్రా రామకృష్ణ ఉన్నారు. ఆమె ఎన్ఎస్ఈ మాజీ సీఈఓగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీనికి తోడు అజ్ఞాత యోగితో చిత్ర జరిపిన ఈ-మెయిల్ సంభాషణలు తాజాగా బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు, ఎవరు ఈమె? చిత్రా రామకృష్ణపై ఆదాయపన్ను& సెబీ సంస్థలు ఎందుకు విచారణ చేపడుతున్నాయి?
ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథలోని ట్విస్టుల వలే అంచనాలకు అందని నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చిత్రా రామకృష్ణ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తాజాగా ఆమె నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఓ యోగి చేతిలో సీఈఓ చిత్ర రామకృష్ణ కీలు బొమ్మలా ఎలా పనిచేసిందో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) విచారణలో తేలిన దానికి కొనసాగింపుగా తాజా దాడులు జరిగాయి.
హిమాలయాల్లో నివసించే యోగి కనుసన్నల్లో చిత్రా రామకృష్ణ నడుచుకున్నట్లు నిర్దారణ అవడం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. యోగి చిత్రా రామకృష్ణ మధ్య జరిగిన ఈ మెయిల్ సంభాషణలూ ఇటీవల వెలుగుచూశాయి. 2013లో చిత్ర ఎన్ఎస్ఈ ఎండీగా సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఓ గుర్తు తెలియన యోగి మాటలు విని ఆమె ఎన్ఎస్ఈ బాధ్యతలు నిర్వహించారు. యోగి ఎవరికి చెబితే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్టులు చెప్పినా ఆమె వినేవారు కారట. 20 ఏళ్లు టచ్లో ఉన్నా వీరిద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదని మొత్తం ఈ–మెయిల్ ద్వారానే సంబాషణలు జరిగేవట.
ఎన్ఎస్ఈ కీలక డేటాను ఉద్యోగులు వివరాలను కంపెనీల డిటైల్స్ను ఆమె ఈ గుర్తుతెలియని యోగికి పంపారట. ఈ మేరకు ఇటీవ సెబీ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఇదిలాఉండగా ఆనంద్ సుబ్రమణియన్ను ఎన్ఎస్ఈ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా చిత్ర నియమించారు. ఆ తర్వాత కొన్ని వారాలకే చీఫ్ స్ట్రాటజిక్ అడ్వయిజర్గా జాబ్ను ఆయనకు ఆఫర్ చేశారు. ఏకంగా రూ. 1. 68 కోట్ల శాలరీతో ఆనంద్ సుబ్రమణియన్ను తీసుకోగా కొన్ని నెలలకే ఆతని శాలరీని మరో రూ. 15 లక్షలు పెంచారు.
తానే మానవుడిగా పుడితే అది ఆనంద్ సుబ్రమణియన్లా ఉంటానని ఈ గుర్తు తెలియని యోగి చిత్ర రామకృష్ణకు చేసిన ఈ–మెయిల్లో ఉండడం గమనార్హం. కాగా ఆనంద్ సుబ్రమణియన్ను చీఫ్ స్ట్రేటజిక్ అధికారిగా నియమించే క్రమంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఇటీవల చిత్రా రామకృష్ణకు సెబీ రూ 3 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా పెనాల్టీని చెల్లించాలని సెబీ ఆమెను ఆదేశించింది. ఇదే సమయంలో సెబీ వెల్లడించిన సమాచారం ఆధారంగా తాజాగా ఐటీ దాడులు జరిగాయి.
చిత్ర రామకృష్ణ ఎవరు..?
చార్టెడ్ అకౌంటెంట్‌గా జీవితం ప్రారంభించిన చిత్రా రామకృష్ణ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన ప్రాజెక్ట్ ఫైనాన్స్ డివిజన్‌లో చేరారు. చిత్ర రామకృష్ణ కాలక్రమేణా ఒక్కో మెట్టు ఎక్కుతూ 2009లో ఎన్ఎస్ఈకి మేనేజింగ్ డైరెక్టర్(ఎండి)గా నియామకం కావడం జరిగింది. ఆ తర్వాత 2013లో ఎన్ఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఈఓ) పదివి చేపట్టి 2016 వరకు కొనసాగారు.