పీకల్లోతు కష్టాల్లో అనిల్ అంబానీ: ఐటీ రీఫండ్స్ విడుదలకు నో

By rajesh yFirst Published Feb 28, 2019, 10:54 AM IST
Highlights


రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్) అధినేత అనిల్ అంబానీని రుణ బాధలు వెంటాడుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎరిక్సన్ బకాయిలను చెల్లించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఆదాయం పన్ను రీఫండ్స్ చెల్లించేందుకు వాడుకోనివ్వాలని ఆర్-కామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను  ఎన్సీఎల్ఏటీలో రుణ దాతలు వ్యతిరేకించారు. 

న్యూఢిల్లీ: ఐటీ రిఫండ్స్‌తో ఎరిక్సన్ బకాయిలు చెల్లిద్దామనుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌-కామ్) ఆశలు ఆవిరవుతున్నాయి. ఆదాయం పన్ను రిఫండ్‌లను ఎరిక్సన్‌ బకాయిలను తీర్చేందుకోసం నేరుగా బదిలీ చేయడానికి ఆర్‌కామ్‌ చేసిన విజ్ఞప్తిని బ్యాంకులు తోసిపుచ్చాయి. ఆర్‌-కామ్ ప్రతిపాదనను బుధవారం నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ)కి బ్యాంకుల తరఫు న్యాయవాది స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 4న విధించిన మారటోరియాన్ని తొలగించాలని కోరుతూ ఆర్‌-కామ్‌ చేసిన విజ్ఞప్తిపై ఎన్సీఎల్‌ఏటీ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన బకాయిల కోసం ఆదాయం పన్ను (ఐటీ) రిఫండ్స్‌ను విడుదల చేయాలని ఆర్‌కామ్.. తమకు అప్పులిచ్చిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను అభ్యర్థించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆర్‌- కామ్ దివాలా ప్రక్రియలో ఉన్నందున ఈ అంశాన్ని ఎన్‌సీఎల్‌ఏటీ ట్రిబ్యునల్ ఎదుటకు సోమవారం ఆర్‌కామ్ తీసుకెళ్లింది.
దీని విచారణ బుధవారానికి వాయిదా పడగా, ఈ క్రమంలోనే ఆర్‌- కామ్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎరిక్సన్ ఖాతాలోకి నేరుగా ఈ సొమ్ము బదిలీ అయ్యేలా చూడాలని ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేశారు.

దీన్ని రుణదాతల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణన్ వేణుగోపాల్ తదితరులు తోసిపుచ్చారు. ఈ విషయాన్ని నిర్ణయించడానికి ట్రైబ్యునల్‌ సరైన వేదిక కాదని, సుప్రీం కోర్టు ఇప్పటికే ఈ విషయాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. అందుకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. 

దీంతో జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ కేసు విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. అంతేగాక 8లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఎస్బీఐతోపాటు రుణదాతలందరిని ఆదేశించింది. ఎరిక్సన్‌కు చెల్లించాల్సిన రూ.550 కోట్ల బకాయిలో మిగతా రూ.453 కోట్లను నాలుగు వారాల్లో చెల్లించకుంటే మూడు నెలల జైలు శిక్షను విధించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 20న ఆర్‌కామ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

click me!