నీరవ్ మోదీకి ఈడీ షాక్: రూ.147 కోట్ల ఆస్తుల జప్తు

By rajesh yFirst Published Feb 27, 2019, 2:50 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి చెందిన రూ.147 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయించుకున్నది. దీంతో ఈడీ రూ.1,725.36 కోట్ల విలువైన నీరవ్ మోదీ, ఆయన అనుబంధ సంస్థల ఆస్తులను జప్తు చేసినట్లు అయింది. 

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసంగించిన కేసులో ప్రధాన నిందితుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కుంభకోణం బయటపడటంతో ఆయనను కట్టడి చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపట్టింది.

నీరవ్ మోదీతోపాటు ఆయన కంపెనీలకు చెందిన రూ.147.72 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. వీటిలో ముంబై, గుజరాత్‌లోని సూరత్ వద్ద స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మార్కెట్ విలువ ప్రకారం  ఆ ఆస్తుల మొత్తం విలువ రూ.147,72, 86,651 అని నిర్దారించింది. 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న వాటిలో ఎనిమిది కార్లు, ప్లాంట్లు, యంత్ర పరికరాలు, ఆభరణాలు, పెంటింగ్స్, భవనాలు ఉన్నాయి. పీఎన్బీని రూ.13 వేల కోట్లు మోసం చేసి గతేడాది జనవరిలో విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

జప్తు చేసిన వాటిలో మోదీకి సంబంధించిన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, రాధేశిర్ జ్యూవెల్లరీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, రైథమ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు చెందిన ఆస్తులు ఉన్నాయి. 

మనీ ల్యాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ) 2002 ప్రకారం ఈడీ వీటిని స్వాధీనం చేసుకున్నది. రూ.1,725.36 కోట్ల విలువైన నీరవ్ మోదీ, ఆయన అనుబంధ సంస్థల ఆస్తులను ఈడీ జప్తు చేసినట్లు అయింది. వీటికితోడు మరో రూ.489.75 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, ఆభరణాలు ఉన్నాయి.

click me!