వడ్డీ లేకుండా రూ.5 లక్షలు రుణం: కేంద్ర బంపర్‌ ఆఫర్‌

By Naga Surya Phani Kumar  |  First Published Aug 26, 2024, 2:07 PM IST

మహిళలు ఆర్థికంగా నిలబడాలని ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. వాటిల్లో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లఖ్‌పతి దీదీ(Lakhpati Didi Scheme) పథకం గురించి. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చు. శిక్షణ కూడా అధికారులే ఇస్తారు. తర్వాత సొంత వ్యాపారం పెట్టుకొనేందుకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.. 


డబ్బులు సంపాదించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే ఏ మార్గంలో సంపాదించాలన్నదే సమస్య. ఉద్యోగం, వ్యాపారం ఈ రెండు మార్గాల్లో చాలా మంది ఉద్యోగాలనే ఎంపిక చేసుకుంటారు. అయితే స్వయం ఉపాధి కల్పనకు ఎక్కువ మంది ప్రయత్నించరు. పెట్టుబడి పెట్టేందుకు డబ్బు లేకపోవడం, అప్పు చేసి పెడితే వడ్డీలు కట్టలేమన్న భయమే దీనికి ప్రధాన కారణం. సొంత కాళ్లపై నిలబడాలన్న తపన, వ్యాపార ఆలోచన ఉన్న మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం Lakhpati Didi Schemeను అమలుచేస్తోంది. 

Lakhpati Didi Schemeకి అప్లై చేయడం ఎలా..
ఈ పథకం ద్వారా రుణాన్ని పొందడానికి మీరు మీ దగ్గరలోని మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ లఖ్‌పతి దీదీ పథకం దరఖాస్తు ఫారం తీసుకొని కావాల్సిన వివరాలు నింపాలి. కావాల్సిన డాక్యుమెంట్లు జత చేసి దరఖాస్తును అధికారులకు ఇవ్వాలి. మీ దరఖాస్తును పరిశీలించిన అధికారులు మీకు అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తిస్తే రుణం మంజూరు చేస్తారు. 

Latest Videos

కావాల్సిన డాక్యుమెంట్లు:
ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌ బుక్‌, డ్వాక్రా గ్రూపు సభ్యత్వ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్‌ ఫొటో, ఫోన్‌ నంబర్‌

ఏఏ రంగాల్లో శిక్షణ ఇస్తారు..
ఈ శిక్షణ మహిళలకు మాత్రమే ఇస్తారు. ఎల్‌ఈడీ బల్బుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, పశుపోషణ, మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ వ్యాపారం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. 

ఈ పథకం పొందడానికి అర్హతలివే..
Lakhpati Didi Scheme పొందడానికి ముఖ్యంగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండాలి. వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలన్నీ ఉన్న మహిళలకు స్వయం ఉపాధి, వ్యాపారం కల్పించడానికి అవసరమైన మేరకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణం అందిస్తారు. 

click me!