Unified Pension Scheme (ఏకీకృత పెన్షన్ పథకం)పై భారత ప్రభుత్వం కీలకమైన అప్డేట్‌ను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్, ఈ భరోసా పెన్షన్‌కు హామీ ఇచ్చే ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS)కి ఆమోదం తెలిపింది. ఈ పథకం 2025 ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది. ఈ కొత్త పథకం ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ ఆర్థిక భద్రత కల్పించనుంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. రండి..
23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి..
గతంలో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పై వచ్చిన విమర్శలకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం UPS ప్రవేశపెట్టంది. UPS పథకంలో 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు పెన్షన్ పొందడానికి అర్హులు. వారు తమ రిటైర్మెంట్ సమయంలో చివరి 12 నెలలకు సగటు తీసుకున్న బేసిక్ వేతనంలో 50% పెన్షన్‌గా అందుకుంటారు. తక్కువ సర్వీస్ ఉన్నవారికి తక్కువ పెన్షన్ అందుతుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు రూ.10,000
UPS ద్వారా నిలకడైన కనీస పెన్షన్ అందుతుంది. అంటే కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు నెలకు కనీసం రూ.10,000 పెన్షన్ లభిస్తుంది. రిటైర్మెంట్ అనంతరం ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి చివరి పెన్షన్ మొత్తం 60% అందుతుంది. ఈ పెన్షన్, ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ఆధారంగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తారు.
ఒకేసారి చెల్లిస్తారు..
రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులు గ్రాట్యుటీతో పాటు, వారి నెల వేతనంలో 10వ వంతు లంప్-సమ్ చెల్లింపును కూడా పొందవచ్చు. ప్రస్తుతం NPS కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు UPSకి మారవచ్చు. ఈ మార్పు తుదివరకు అమలులో ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వంపై రూ.6,250 కోట్ల భారం
UPS అమలు చేయడంలో మొదటి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.6,250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ పథకానికి సంబంధించిన మునుపటి బకాయిల కోసం రూ.800 కోట్ల అదనపు ఖర్చు ఉంటుంది. కొత్త UPS పథకం ప్రభుత్వ ఉద్యోగులకు విశ్వాసాన్ని పెంపొందించడానికి, పింఛన్ విధానాలపై ఉన్న విభేదాలను తొలగించడానికి ఉపయోగపడుతుందని నాయకులు భావిస్తున్నారు.