
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి ఐదు నగరాలకు సర్వీసులు (IndiGo airlines) నడపనుంది. వీటిలో మార్చి 27 నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్, మార్చి 29 నుంచి విశాఖపట్నం, బెంగళూరులకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సర్వీసులు అందిస్తున్న నగరాల్లో కడప 73వది. కరోనా మహమ్మారితో విమాన రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా నుంచి కోలుకునే సమయంలోనే ఇంధన ధరల పిడుగుపడింది. దీంతో ఏవియేషన్ సెక్టార్ ఇప్పుడప్పుడే గాడిన పడదు అనే వాదనలు వినిపించాయి. కానీ కడప లాంటి టైర్ త్రీ సిటీస్‌లో కూడా తిరిగి విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్ సెక్టార్ త్వరగా కోలుకుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.
గతంలో ఇండిగో.. ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP AIRPORTS DEVELOPMENT CORPORATION LIMITED)తో ఒప్పందం చేసుకుంది. అలాగే గతంలో 17ఎయిర్ పోర్టులను పైలెట్ శిక్షణ కేంద్రాలుగా కేంద్రం ఎంపిక చేయగా అందులో కడప విమానాశ్రయానికి చోటు దక్కింది. ఫలితంగా ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆపరేషన్ కింద పైలెట్లకు కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.
గతంలో కడప నుంచి విజయవాడ, చెన్నైలకు విమాన సర్వీసులు నడిపిన ట్రూజెట్ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పదం రద్దుచేసుకోవడంతో ఇండిగోకు అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీచేసింది. ఇండిగో సంస్థ మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను చెన్నై–కడప, విజయవాడ–కడప మధ్య నడపనుంది. ఈ విమానాలు అందుబాటులోకి వస్తే కడప నుంచి విజయవాడకు ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. కడప మాత్రమే కాదు రాయలసీమవాసులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పాలి.