ఆర్బీఐ నిష్క్రియా పరత్వం: రూపీ@73.78

By Arun Kumar PFirst Published Oct 4, 2018, 12:03 PM IST
Highlights

ముడి చమురు ధరల పెరుగుదల, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం దరిమిలా విదేశీ ఇన్వెస్టర్లు రూ.1550 కోట్ల మదుపు ఉపసంహరణ వంటి అంశాలతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా గురువారం అమెరికా డాలర్‌పై రూపాయి విలువ సరికొత్త రూ.73.78 జీవితకాల కనిష్ట రికార్డును నెలకొల్పింది. 

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఆర్థికశాఖ, ఆర్బీఐ నిష్క్రియా పరత్వం పుణ్యమా? అని అమెరికా డాలర్‌పై రూపాయి పతనాన్ని నిలువరించలేకపోతున్నారు. ఏ రోజుకారోజు జీవితకాల కనిష్ట స్థాయికి పతనం అవుతూనే ఉన్నది. తాజాగా గురువారం అమెరికా డాలర్‌పై రూపాయి పతనం రూ.73.78 వద్ద దిగజారిపోయింది. ముడి చమురు ధరల పెరుగుదల, కరంట్ ఖాతా లోటు పెరుగుతుందన్న ఆందోళన, విదేశీ పెట్టుబడుల నిష్క్రమణ వంటి అంశాలతో రూపాయి నేను నిలువజాలనంటూ దిగువకు పరుగులు పెడుతోంది. ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ రూపాయి- డాలర్ మారకం 73.60-74.20 వద్దకు చేరవచ్చునని అంచనా వేశారు. 

సోమవారం ముగింపు 72.91 నుంచి బుధవారం 43 పైసలు పెరిగి రూ.73.42 వద్ద స్థిరపడింది. అయితే బుధవారం ఒక్కరోజు విదేశీ మదుపర్లు రూ.1,550 కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ క్లయింట్ గ్రూప్ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటర్జీ అధిపతి వీకే శర్మ మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వ రంగ ముడి చమురు సంస్థలు విదేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేయడానికి అవసరమైన డాలర్లను సరఫరా చేసేందుకు స్పెషల్ విండో ఏర్పాటు చేయడానికి ఆర్బీఐ నిరాకరించింది. ఫలితంగా రూపాయి విలువ మరింత పతనం కావడానికి దారి తీసింది. డాలర్ మరింత బలోపేతం అవుతుండగా, ఇతర దేశాల కరెన్సీలు మరింత బలహీనపడ్డాయి’ అని చెప్పారు. 

వచ్చేనెల నుంచి ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పైపైకి పెరిగిపోయే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుందన్న సందేహాల మధ్య మరోవైపు శుక్రవారం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీరేట్లు పెంచుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలో రూపాయికి మద్దతుగా కేంద్ర ముడి చమురు సంస్థలు 10 బిలియన్ల డాలర్ల విదేశీ వాణిజ్య రుణాలు పొందేందుకు మాత్రం ఆర్బీఐ అనుమతించింది. 

ఇదిలా ఉంటే గురువారం రూపాయి విలువ పతనం, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం వంటి పరిణామాల నేపథ్యంలో దలాల్ స్ట్రీట్‌లో గందరగోళం నెలకొంది. బీఎస్ఈ ఇండెక్స్ 36 వేల, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 10,900కు దిగువనే పతనమయ్యాయి. డీబీఎస్ బ్యాంక్ ట్రేడింగ్ హెడ్ అవీష్ వైద్య మాట్లాడుతూ ముడి చమురుతోపాటు అంతర్జాతీయ సూక్ష్మ పరిస్థితుల నుంచి ఒత్తిడి రావడంతో రూపాయి మరింత పతనమైంది’ అని తెలిపారు. బ్యాంకింగ్ షేర్లు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మారుతి సుజుకి షేర్లు పతనమయ్యాయి. 

click me!