
Luna Coin Delisted: గత రెండు రోజులుగా క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో సంభవించిన భూకంపం అనేక డిజిటల్ కరెన్సీలను తీవ్రంగా ప్రభావితం చేసింది. చాలా డిజిటల్ కాయిన్స్ భారీ నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ పతనంలో ఎక్కువగా నష్టపోయిన టోకెన్ ఒకటి ఉంది. Terra (LUNA) విలువ చాలా వేగంగా పడిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్ Terra (LUNA)ని దాని ప్రాజెక్ట్ నుంచి డీ లిస్ట్ చేసింది.
ఇప్పుడు తాజాగా గ్లోబల్ ఎక్స్ఛేంజీల తర్వాత, WazirX, Coinswitch Kuber, CoinDCXతో సహా భారతీయ ఎక్స్ఛేంజీలు స్టేబుల్ కాయిన్ Terra (LUNA)ను తమ ట్రేడింగ్ ప్లాట్ ఫాం నుంచి తొలగించాయి. టెర్రా క్రిప్టో టోకెన్ విలువ 1 డాలర్ కంటే దిగువకు పడిపోయింది, దాంతో ఇన్వెస్టర్ల సంపద పూర్తిగా నాశనం అయ్యింది.
Binance ఎక్స్ చేంజ్ LUNA/USDTతో శాశ్వత ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లూనా క్రిప్టోకరెన్సీ విలువ 24 గంటల్లో 99 శాతం పడిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా టెర్రా పెట్టుబడిదారులకు భారీగా నష్టాలు వచ్చాయి. క్రిప్టో ఎక్స్ఛేంజ్ Terra (LUNA) కోసం క్రాస్ మరియు ఐసోలేటెడ్ మార్జిన్ పెయిర్, స్పాట్ ట్రేడింగ్ పెయిర్‌ను కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఒక రోజు ముందే, Binance CEO Changpeng Zhao, తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా, కొత్త డిజిటల్ కాయిన్ సంస్థలు ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్‌ను గౌరవించడం చాలా ముఖ్యం అంటూ పెట్టుబడిదారులను హెచ్చరించారు. చాంగ్‌పెంగ్ జావో చేసిన ఈ ట్వీట్ టెర్రాలో కొనసాగుతున్న క్షీణతకు సంబంధించిందే అని నిపుణులు పేర్కొంటున్నారు.
CoinMarketCap నుండి వచ్చిన డేటా ప్రకారం గత నెలలో క్రిప్టోకరెన్సీల మార్కెట్ విలువలో 800 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 61 లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది. దాదాపు అన్ని క్రిప్టోకరెన్సీలు గత కొన్ని రోజులుగా పడిపోతూనే ఉన్నాయి. USD కాయిన్, టెథర్, బినాన్స్ USD కొన్ని ప్రసిద్ధ స్టేబుల్‌కాయిన్‌లు US డాలర్‌తో ముడిపడి ఉంటాయి. USDT, Terra LUNA కూడా ఈ స్టేబుల్ కాయిన్స్ జాబితాలో ఉన్నాయి.
మార్కెట్ పతనం తర్వాత కూడా వాటి విలువలో స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది. కానీ బుధవారం టెర్రా లూనా విషయంలో మాత్రం ట్రెండ్ రివర్స్ అయింది. స్టేబుల్ కాయిన్స్ జాబితాలో చేర్చబడిన ఈ నాణెం ఒక రోజులో 90 శాతం పడిపోయింది, ఇది మరుసటి రోజు నాటికి 99 శాతం మార్కును దాటింది.