
గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి. దీంతో చాలా పెద్ద కంపెనీల విలువ సగానికి సగం పడిపోయింది. Facebook మాతృసంస్థ Meta, Google మాతృసంస్థ Alphabet, ElonMuskకు చెందిన సంస్థ Tesla ఇలా ప్రతి దిగ్గజ కంపెనీ మార్కెట్ క్యాప్ బాగా పడిపోయింది.
ఈ అమ్మకాల ప్రభావం ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ కంపెనీలపై కూడా పడింది. అదానీ గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు, అదానీ విల్‌మార్ (Adani Wilmar), అదానీ పవర్ (Adani Power) కొద్ది రోజుల క్రితం వరకు పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇవ్వగా, ఆ తర్వాత ఇవి అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో రెండు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1 లక్ష కోట్ల దిగువకు పడిపోయింది.
ప్రస్తుతం ఇది అదానీ విల్మార్ (Adani Wilmar)విలువ
అదానీ విల్మార్ (Adani Wilmar) ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. కంపెనీ IPO తర్వాత, దాని షేర్లు స్టాక్ మార్కెట్‌లో తగ్గింపుతో లిస్ట్ అయ్యాయి. కానీ ఆ తరువాత, అదానీ విల్మార్ స్టాక్‌పై నిరంతర అప్పర్ సర్క్యూట్ తాకుతూనే ఉంది. ఇది రూ. 878.35 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ బూమ్ కంపెనీ మార్కెట్ క్యాప్‌ను రూ. 1 లక్ష కోట్లకు పెంచింది. అధిక స్థాయిని తాకిన తర్వాత, ఇది వరుసగా 8 రోజులు క్షీణించింది, ఇందులో వరుసగా ఐదు రోజులు లోయర్ సర్క్యూట్ కు పడి పోయింది. ప్రస్తుతం కంపెనీ Adani Wilmarఎమ్‌క్యాప్ రూ.77,980 కోట్లుగా ఉంది.
అదానీ పవర్ mcap భారీగా పతనం..
అదేవిధంగా, అదానీ పవర్ మార్కెట్ క్యాప్ (Adani Power) కూడా ప్రభావితమైంది.Adani Power మార్కెట్ క్యాప్ గురువారం బాగా పడిపోయి రూ.93,550 కోట్లకు తగ్గింది. అయితే ఈరోజు మళ్లీ అదానీ పవర్ స్టాక్‌లో అప్పర్ సర్క్యూట్ తాకింది. అప్పర్ సర్క్యూట్ తోనే ట్రేడింగ్ ప్రారంభించి రోజంతా 4.99 శాతం లాభంతో రూ.254.65 వద్ద కొనసాగుతోంది. అయినప్పటికీ కంపెనీ ఎమ్‌క్యాప్ ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం అదానీ పవర్ విలువ రూ.98,216.95 కోట్లుగా ఉంది.
వారెన్ బఫెట్ , బిల్ గేట్స్ వెనుకే అదానీ
గ్రూప్ కంపెనీల షేర్ ధర పతనం కారణంగా గౌతమ్ అదానీ నికర విలువ కూడా ప్రభావితమవుతోంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, గత 24 గంటల్లో గౌతమ్ అదానీ నికర విలువ 3.5 బిలియన్ డాలర్లు తగ్గింది. ప్రస్తుతం, గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ 108.1 బిలియన్లు , ఆయన ప్రస్తుతం ప్రపంచంలోనే ఆరవ ధనవంతుడు. గతంలో గౌతమ్ అదానీ సంపద పరంగా వారెన్ బఫెట్ , మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించారు. అయితే, ఇప్పుడు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ ఇద్దరూ మళ్లీ గౌతమ్ అదానీని అధిగమించారు.