ఇరాన్‌పై ఆంక్షల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన భారత్ క్రూడ్ ఇంపోర్ట్స్

By Siva KodatiFirst Published Feb 17, 2019, 1:25 PM IST
Highlights

ఇరాన్‌కు ఆంక్షల సెగ బాగానే తగులుతోంది. ఆరు నెలల పాటు మినహాయింపునిచ్చినా.. వచ్చే నాలుగు నెలల్లో భారత్ పూర్తిగా ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి నిలిపేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతిలో డిసెంబర్ నెల నాటికి ఆరో స్థానంలో ఉన్న భారత్.. జనవరి కల్లా ఏడు స్థానానికి పతనమైంది.

ఇరాన్ నుంచి భారత ముడి చమురు దిగుమతులు క్రమంగా తగ్గుతున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో గత నెలలో ఏకంగా 45 శాతం పడి పోయాయి. జనవరిలో దేశంలోకి వచ్చిన రోజువారి ఇరాన్ ముడి చమురు 2,70,500 బ్యారెళ్లుగా ఉన్నది.

ముందుగా అంచనా వేసిన మూడు లక్షల బ్యారెళ్ల కంటే ఇది తక్కువే. కొన్ని నౌకల రాక ఆలస్యమైనట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చమురు అమ్మకంతో వచ్చే ఆదాయంపైనే ఆధారపడ్డ ఇరాన్‌ను దారిలోకి తెచ్చేందుకు గతేడాది నవంబర్‌లో అగ్రరాజ్యం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ఇరాన్ అణు కార్యకలాపాల నియంత్రణతోపాటు సిరియా, యెమన్, లెబనాన్, ఇతర మధ్య ప్రాచ్య దేశాల్లో ఉగ్రవాదులకు ఇరాన్ ఇస్తున్న మద్దతును నిలువరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఇరాన్ నుంచి ముడి చమురును కొనరాదని ప్రపంచ దేశాలకు అమెరికా స్పష్టం చేసింది.

భారత్‌తోపాటు ఎనిమిది దేశాలకు ఆరు నెలల మినహాయింపునిచ్చింది. దేశ చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతులతోనే తీరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెమ్మదిగా అమెరికా ఆంక్షల అమలు దిశగా భారత్ అడుగులేస్తున్నది.

రోజుకు మూడు లక్షల బ్యారెళ్ల చొప్పున నెలకు 1.25 మిలియన్ టన్నులను మించి ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోళ్లు జరుపరాదని భారత్‌పై అమెరికా నిబంధనలు విధించింది. దీంతో డిసెంబర్‌లోనే భారత్ ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను తగ్గించింది.

జనవరిలో అదనంగా మరో 10.4 శాతం దిగుమతుల్ని తగ్గించుకున్నది. ఈ క్రమంలో భారత్‌కు ముడి చమురును ఎగుమతి చేస్తున్న దేశాల్లో డిసెంబర్‌ నెలలో ఇరాన్ ఆరో స్థానంలో నిలిచింది. తీరా గత నెలకు వచ్చే సరికి ఏడో స్థానానికి దిగజారింది.

గతేడాది జనవరి భారతీయ ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 10 శాతంగా ఉన్న ఇరాన్ క్రూడ్ వాటా.. ఈ ఏడాది జనవరిలో సుమారు ఆరు శాతానికి క్షీణించింది. భారత్‌కు ముడి చమురును ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఒకప్పుడు ఇరాన్ మూడో స్థానంలో ఉన్నది తెలిసిందే.

అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురు దిగుమతిదారులను ఆకట్టుకునేందుకు ఇరాన్ రాయితీలనూ ప్రకటించింది. ఇరాన్‌పై ఆంక్షల సంకేతాలు ముందు నుంచే ఉన్న నేపథ్యంలో గతంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) తొలి పది నెలల్లో భారత్ ముడి చమురు దిగుమతులు బాగానే పెరిగాయి.

గతేడాది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి జనవరి దాకా జరిగిన దిగుమతుల్లో 14.5 శాతం పెరుగుదల కనిపించింది. సగటున రోజుకు 5,07,000 బ్యారెళ్ల ముడి చమురు ఇరాన్ నుంచి భారత్‌కు చేరింది. అమ్మకాలను పెంచుకునేందుకు దాదాపు ఉచిత రవాణా, రుణ పరిమితి పొడిగింపు తదితర ఆఫర్లను ఇచ్చింది.

దీంతో రిఫైనర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ఈ నెలలో ఇరాన్ ముడి చమురు కొనుగోళ్ల కోసం భారతీయ ప్రభుత్వ రిఫైనరీలు పెద్ద ఎత్తునే ఆర్డర్లిచ్చాయి. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఐదు మిలియన్ల బ్యారెళ్లు, మంగళూరు రిఫైనరీ పెట్రోలియం కార్ప్ రెండు మిలియన్ బ్యారెళ్లు, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ఒక్కో మిలియన్ బ్యారెళ్ల చొప్పున కొనాలి. 

దీనిపై ఆయా సంస్థలు స్పందించకుండా ఉండగా, ప్రభుత్వ వర్గాలు మాత్రం గత ఆర్థిక సంవత్సరం (2017-18) కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులు పెరుగవచ్చని అంచనా వేస్తున్నాయి. రోజుకు 4,52,000 బ్యారెళ్లు గానీ, మొత్తం 22.6 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతులు జరుగవచ్చని చెబుతున్నారు. 

ఒక్క జనవరిలోనే ఆయా దేశాల నుంచి మొత్తం భారత చమురు దిగుమతులు రోజుకు 4.6 మిలియన్ బ్యారెళ్లుగా నమోదయ్యాయి. అయినప్పటికీ ఇది గతంతో పోల్చితే దాదాపు 10.4 శాతం తక్కువ కావడం గమనార్హం.

click me!
Last Updated Feb 17, 2019, 1:25 PM IST
click me!