మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ: భారత్ అభ్యర్థనను గౌరవిస్తామన్న అంటిగ్వా

First Published 28, Jul 2018, 11:28 AM IST
Highlights

మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి అండర్‌టేకింగ్ పథకం పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి రెండు బిలియన్ల డాలర్ల కుచ్చుటోపీ పెట్టిన ఆభరణాల వ్యాపారి మెహుల్ చోక్సీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేరస్థుల అప్పగింత ఒప్పందం అమలులో లేకున్నా భారత్ అభ్యర్థిస్తే గౌరవిస్తామని అంటిగ్వా ప్రకటించింది. 

న్యూఢిల్లీ: మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి విదేశాల్లో రుణాల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అండర్ టేకింగ్‌ల పేరిట మోసగించి, విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గీతాంజలి జెమ్స్ అండ్ జ్యువెల్లరీస్ అధినేతగా మెహుల్ చోక్సీకి గత ఏడాది నవంబర్ నెలలో అంటిగ్వా పౌరసత్వాన్ని జారీచేసింది. వివాదాస్పద సిటిజన్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ పౌసత్వాన్ని జారీ చేసింది. కొన్నేళ్ల క్రితం అంటిగ్వా ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. 

దోషి మెహుల్ చోక్సీని అప్పగించాలన్నభారత్ అభ్యర్థనను గౌరవించక తప్పదని అంటిగ్వా ప్రభుత్వం తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి రెండు బిలియన్ల మేరకు మోసం చేసిన సంగతి తెలియక ముందే కరేబియన్ దీవుల్లో పౌరసత్వం ఇచ్చామని, కానీ తాజా పరిస్థితుల్లో దోషిని అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను గౌరవిస్తున్నట్లు అంటిగ్వా విదేశాంగ శాఖ మంత్రి ఈపీ చెట్ గ్రీన్ తెలిపారు. 

భారత అభ్యర్థనను అంగీకరిస్తున్నట్లు గురువారం అంటిగ్వా క్యాబినెట్ సమావేశం తర్వాత బహిరంగంగా ప్రకటించడంతో మెహుల్ చోక్సీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెహుల్ చోక్సీ తలదాచుకున్న అంటిగ్వాతో భారత దేశానికి ఎటువంటి నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవడం గమనార్హం. భారత దర్యాప్తు సంస్థలు అంటిగ్వా ప్రభుత్వాన్ని సంప్రదించబోవనే దీమాతోనే మెహుల్ చోక్సీ ఆ దేశ పౌరసత్వం తీసుకోవడం.. దర్యాప్తు సంస్థలు ఆయనను అప్పగించాలని కోరడం వెంట వెంటనే జరిగిపోయాయి. 

కానీ అంటిగ్వా, బార్బుడా జంట దీవులతో కూడిన కరేబియన్ ప్రభుత్వం తాము ఎటువంటి ఒప్పందం లేకుండా నేరస్థులను అప్పగించబోమని ప్రకటించింది. దోషి మెహుల్ చోక్సీని అప్పగించాలని భారత ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి అభ్యర్థన రాలేదని గ్రీన్ పేర్కొనడం గమనార్హం. ‘ఒకవేళ భారత్ నుంచి నేరస్థులను అప్పగించాలని అభ్యర్థన వస్తే ‘నేరస్థుల అప్పగింత ఒప్పందంతో సంబంధం లేకుండా’ భారతదేశానికి మెహుల్ చోక్సీని అప్పగిస్తాం’ అని కూడా గ్రీన్ చెప్పారని ఒక దిన పత్రిక పేర్కొంది. 

ఇన్వెస్ట్ మెంట్ తో పౌరసత్వ విధానం సమగ్రతను కాపాడుకోవడానికి తమకు గల నిబద్ధత ఇదేనని గ్రీన్ అన్నారు. మెహుల్ చోక్సీ  పెట్టుబడులు పెట్టడం ద్వారా అంటిగ్వాలో పౌరసత్వం పొందారు. పెట్టుబడితో పౌరసత్వ విధానం ద్వారా 2 బిలియన్ల డాలర్ల వరకు పెట్టుబడులు సంపాదించింది. తద్వారా పాస్ పోర్టుల ద్వారా ఆదాయం పొందుతున్న దేశాల్లో రెండో స్థానంలో నిలిచింది. 

గతేడాదే అంటిగ్వా అండ్ బార్బుడాలో వీసా రహితంగా ప్రవేశానికి కెనడా అనుమతి మంజూరు చేసింది. కానీ దీన్ని థర్డ్ కంట్రీ నేషనల్స్ తమ యాజమాన్య పద్ధతులు బలహీనంగా ఉన్నందుకు ఇక్కడ సిటిజన్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ ప్రపంచంలోకెల్లా నిర్లక్ష్యపూరిత పథకం అని అమెరికా విదేశాంగశాఖ అభిప్రాయ పడింది. 

అంటిగ్వా పరిధిలో 365 అతి పొడవైన పురాతన కాలం నాటి బీచ్‌లు ఉండటంతో ఏటా వేల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ మేరకు కఠినంగా పాస్ పోర్టులను తనిఖీ చేశాకే అనుమతించాలని కోరారు. అంటిగ్వా అండ్ బార్బుడా దాదాపు 132 దేశాల పౌరులకు ఫ్రీ వీసా అనుమతినిస్తున్నది. వాటిలో బ్రిటన్, సింగపూర్ తదితర దేశాలు ఉన్నాయి. గత వారమే అంటిగ్వా పౌరసత్వం తీసుకుంటున్నట్లు మెహుల్ చోక్సీ ఆశ్చర్యకర ప్రకటన చేయడంతో ఈ సంగతంతా బయట పడింది. 

Last Updated 28, Jul 2018, 11:28 AM IST