9 గంటలు ఏకబిగినా.. ఈడీ ముందు కొచ్చర్ దంపతుల విచారణ

By rajesh yFirst Published May 14, 2019, 10:37 AM IST
Highlights

వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు చేయడంలో ఐసీఐసీఐ మాజీ ఎండీ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ పాత్రపై సోమవారం ఈడీ అధికారులు తొమ్మిది గంటల పాటు ఏకబిగిన విచారించారు. మంగళవారం కూడా వారిని విచారిస్తారని సమాచారం.
 

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు సోమవారం విచారణకు హాజరయ్యారు. బ్యాంకు రుణాల మోసం, మనీ లాండరింగ్‌ కేసుల్లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.

ఈడీ ప్రధాన కార్యాలయం గల ఖాన్‌ మార్కెట్‌కు కొచ్చర్ దంపతులు రావాల్సిన సమయానికంటే అంటే ఉదయం 11 గంటలకు ముందే హాజరైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రాత్రి 8 గంటల తర్వాతే వారిని బయటకు పంపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 

దర్యాప్తు ముందుకు సాగడం కోసం వీరిద్దరూ దర్యాప్తు అధికారి(ఐఓ)కి సహకరించినట్లు తెలుస్తోంది. ఏ విషయాలపై ప్రశ్నించారో తెలియలేదు. కానీ ఈడీ అధికారులు ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్ ‌(పీఎంఎల్‌ఏ) కింద వీరి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

మంగళవారం సైతం కొచ్చర్‌ దంపతులను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నెల మొదట్లోనే వీరిద్దరూ ఈడీ ముందుకు రావాల్సి ఉన్నా.. గడువు పొడిగించాలని కోరి, అనుమతి పొందారు. దీపక్‌ సోదరుడు రాజీవ్‌ కొచ్చర్‌ను కొద్ది రోజుల క్రితం పలుమార్లు ఈడీ విచారించడం గమనార్హం.

ఇదే కేసులో సీబీఐ కూడా రాజీవ్‌కొచ్చర్‌ను గతంలోనూ విచారించింది. రుణ పునర్నిర్మాణంలో రాజీవ్‌కు చెందిన సింగపూర్‌ కంపెనీ అవిస్త అడ్వైజరీ పాత్రపై ఆయనను సీబీఐ అప్పట్లో విచారించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రుణం పొందే విషయంలో వీడియోకాన్‌కు రాజీవ్‌ కొచ్చర్ అందించిన సహకారంపైనా సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం.

click me!