టాక్స్ ఎగవేత ఆరోపణలు: నరేశ్‌ గోయల్‌కు ఐటీ సమన్లు

Siva Kodati |  
Published : Jun 16, 2019, 11:10 AM IST
టాక్స్ ఎగవేత ఆరోపణలు: నరేశ్‌ గోయల్‌కు ఐటీ సమన్లు

సారాంశం

కార్పొరేట్ ప్రముఖులంతా ఏదో ఒక సమయంలో కప్పదాట్లకు పాల్పడతారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ కం మాజీ ప్రమోటర్ నరేశ్ గోయల్‌కూ వర్తిస్తుంది

రుణ సంక్షోభంతో మూతబడ్డ జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు మరో షాక్‌ తగిలింది. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఆయనకు ఆదాయం పన్ను శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసిందని విశ్వసనీయ వర్గాల కథనం. 

నరేశ్ గోయల్‌ను రూ.650 కోట్ల పన్ను ఎగవేత కేసులో అధికారులు ప్రశ్నిస్తారని తెలుస్తోంది. గోయల్‌కు ఐటీ శాఖ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ శాఖ దర్యాప్తు చేపట్టింది. 

గతేడాది సెప్టెంబర్ నెలలో ముంబైలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫీస్‌లో అధికారులు సోదాలు జరిపి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తు ఫిబ్రవరిలో ముగిసింది. ఈ మేరకు ఐటీ దర్యాప్తు విభాగం నివేదికను అసెస్‌మెంట్‌ వింగ్‌కు పంపారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌, దుబాయ్‌లోని ఎయిర్‌లైన్‌ గ్రూప్‌ కంపెనీకి మధ్య అక్రమ లావాదేవీలు జరిగాయని దర్యాప్తులో తేలింది. దుబాయ్‌లోని జనరల్‌ సేల్స్‌ ఏజెంట్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏటా భారీ మొత్తంలో కమిషన్లు ముట్టజెప్పినట్లు దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. ఆదాయం పన్ను చట్టం కింద ఉన్న పరిమితులను దాటి ఈ చెల్లింపులు జరిగినట్లు తేలింది. 

‘జెట్‌ ఎయిర్‌వేస్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగింది. పన్ను ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్లించాలనే ఉద్దేశంతోనే ఈ చెల్లింపులు జరిగాయి. ఈ చెల్లింపులపై ప్రశ్నించేందుకు గోయల్‌కు సమన్లు జారీ చేశాం’ అని ఐటీశాఖ అధికారులు తెలిపారు. 

భారీ పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ ఆయనకు సమన్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని  నరేష్‌ గోయల్‌ను ఆదేశించింది. అయితే తాజా పరిణామాలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.

ఫిబ్రవరిలో వెలువడిన ఈ నివేదికపై స్పందించిన జెట్‌ఎయిర్‌వేస్‌ అవకతవకల ఆరోపణలను అప్పట్లోనే ఖండించింది. లావాదేవీలన్నీచట్ట ప్రకారం, నియంత్రణ, కార్పొరేట్ పాలన అవసరాలకు లోబడే ఉన్నాయంటూ వివరణ ఇచ్చిన సంగతి  తెలిసిందే. తాజాగా నరేశ్ గోయల్ కు ఐటీ శాఖ జారీ చేసిన సమన్లపై స్పందించేందుకు జెట్ ఎయిర్వేస్ నిరాకరించింది.

PREV
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !