పలు కార్పొరేట్ సంస్థలు బోగస్ పేర్లతో కాంట్రాక్టులు పొందుతూ హవాలా లావాదేవీలు జరిపినట్లు ఐటీ శాఖ దాడుల్లో గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది. ఇలా హవాలా లావాదేవీలు జరిపిన సంస్థలు ఎక్కువగా ఢిల్లీ, ముంబై నగరాల పరిధిలోనే ఉన్నాయని వివరించింది.
న్యూఢిల్లీ: మౌలిక వసతుల అభివృద్ధి రంగంలో సేవలందిస్తున్న పలు ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన దాదాపు రూ.3,300 కోట్ల విలువైన హవాలా రాకెట్‌ను ఆదాయం పన్ను శాఖ (ఐటీ) బట్టబయలు చేసింది. ఈ రాకెట్‌లో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై నగరాలకు చెందిన కార్పొరేట్ సంస్థలు విస్తరించి ఉన్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం ప్రకటించింది.
aslo read జొమాటో కస్టమర్లకు ఫ్రీ వాలెట్ పార్కింగ్......
భారీగా ఆదాయం పన్ను చెల్లింపుల ఎగవేతల విషయమై ఈ నెల మొదటి వారంలో జరిపిన సోదాల్లో ఈ హవాలా రాకెట్ బయటపడిందని సీబీడీటీ తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, ఎరోడ్, పుణె, ఆగ్రా, గోవా తదితర నగరాలలో ఈ సోదాలు జరిపామని సీబీడీటీ తెలిపింది.
బోగస్ బిల్లులను జారీ చేస్తూ హవాలా లావాదేవీలను జరుపుతున్న ముఠాలను ఈ దాడుల్లో తాము గుర్తించినట్లు తెలిపింది. ఈ సోదాల్లో తమకు విలువైన సమాచారంతో పాటు హవాలా లావాదేవీలకు సంబంధించిన బలమైన ఆధారాలు లభించాయని సీబీడీటీ తెలిపింది. ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్థలు ఏ విధంగా తమ వద్ద ఉన్న బ్లాక్‌మనీని హవాలా రూపంలో మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
ఇందులో ఏఏ వర్గాల వారు పాలుపంచుకుంటున్నది కూడా తమ సోదాల్లో వెల్లడైందని సీబీడీటీ వెల్లడించింది. బోగస్ కాంట్రాక్టుల ద్వారా హవాలా లావాదేవీలు జరుగుతుండడం గమనించి పక్కా ఆధారాలతో తాము ఈ దాడులు నిర్వహించామని సీబీడీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
aslo read రీసైక్లింగ్ కోసం 78 టన్నుల ప్లాస్టిక్ : రిలయన్స్ రికార్డ్
ఈ హవాలా లావాదేవీల్లో పాలు పంచుకుంటున్న సంస్థలు ఎక్కవగా జాతీయ రాజధాని ప్రాంతం, ముంబై నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు తమ విశ్లేషణలో తేలిందని పేర్కొంది. ఈ హవాలా రాకెట్‌లో పాల్గొన్న సంస్థల పేర్లను మాత్రం సీబీడీటీ బయటకు వెల్లడించలేదు.
బోగస్ బిల్లులను జారీ చేస్తున్న సంస్థల్లో అత్యధికం దక్షిణ భారతలోనే నెలకొనగా తమ విచారణలో వెలుగులోకి వచ్చిందని.. ఆయా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీబీడీసీ తెలిపింది. ఈ దాడుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తికి రూ.150 కోట్లకు పైగా చెల్లింపులు జరిగిన విషయం వెలుగులోకి వచ్చిందని సీబీడీటీ తెలిపింది.