
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) మాజీ ఎండీ గురుప్రతాప్ బొపరాయ్ ప్రముఖ సంస్థ మహీంద్రా గ్రూప్‌లో నియామకం కానున్నారు. ఈ విషయాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ఫార్మ్ ఎక్విప్‌మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రాజేష్ జెజురికర్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆ పోస్ట్‌లో ఈ విధంగా రాశారు. "గురుప్రతాప్ బొపరాయ్‌ను మహీంద్రాకు స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నామని, ఉన్నతమైన స్థానంలో బొపరాయ్‌ను చూడబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహీంద్రా కంపెనీలో బొపరాయ్ స్థానాన్ని జెజురికర్ వెల్లడించనప్పటికీ.. అతను యూరప్‌లోని మహీంద్రా ఆటోమోటివ్ బిజినెస్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియామకం కానున్నట్లు తెలుస్తోంది. యూరప్‌లోని మహీంద్రా ఆటోమోటివ్ బిజినెస్ సీఈవోగా బొపరాయ్ ఆటోమొబిలి, పినిన్‌ఫరినా, ప్యుగోట్ మోటోసైకిల్స్‌ను చూసుకోనున్నట్లు సమాచారం.
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) ఎండీ పదవికి గురుప్రతాప్ బొపరాయ్ రాజీనామా చేస్తున్నట్లు గతేడాది డిసెంబర్ 15న అధికారికంగా ప్రకటించగా.. జనవరి 1, 2022 నుంచి ఆయన స్కోడా కంపెనీ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ప్రస్తుతం పీయూష్ అరోరా ఎండీగా బాధ్యతలు స్వీకరించినట్లు ఇటీవల స్కోడా సంస్థ అధికారికంగా ప్రకటించింది.
స్కోడా సంస్థ చేపట్టిన ఇండియా 2.0 ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో గురుప్రతాప్ కీలక పాత్ర పోషించారు. అలాగే స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ స్టేట్స్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా పేరిట విడివిడిగా ఉన్న సంస్థలను విలీన ప్రక్రియ ద్వారా ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలోనూ గురుప్రతాప్ నాయకత్వం సంస్థకు ఎంతగానో ఉపయోగపడింది. బొపరాయ్ స్కోడా సంస్థలో 2018, ఏప్రిల్‌లో చేరారు.
అంతకుముందు బొపరాయ్ 2012 నుండి ఫియట్ ఇండియా సీఈవోగా పనిచేశారు. 2007లో ఫియట్‌లో తయారీ, పవర్‌ట్రెయిన్ విభాగానికి అసిస్టెంట్ వీపీగా చేరిన బొపరాయ్ రెండు సంవత్సరాల తర్వాత పవర్‌ట్రైన్ విభాగానికి అధిపతిగా కొనసాగారు. బొపరాయ్ TELCO (ప్రస్తుతం టాటా మోటార్స్), Ocap Chassis Parts, Iveco, Tata Cummins వంటి సంస్థలలో కూడా పనిచేశారు. గురుప్రతాప్ బొపరాయ్‌కు పరిశ్రమ రంగంలో 25 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది.