ఒక్క నెలలో 1.20 లక్షల కోట్లు... జీఎస్టీ ఆల్‌టైమ్ రికార్డ్

By Siva KodatiFirst Published Jan 31, 2021, 10:11 PM IST
Highlights

గతేడాది భారీగా క్షీణించిన జీఎస్టీ వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. జనవరి మాసానిక గానూ దాదాపు రూ.1.20 లక్షల కోట్లు వసూలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు అవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం

కరోనా సంక్షోభం కారణంగా ఆర్ధిక రంగం కుదేలైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్ ఆంక్షలను తొలగించడంతో పాటు వ్యాపారాలకు అనువైన సౌకర్యాలు కల్పించడంతో ఇప్పుడిప్పుడే ఆర్ధిక వ్యవస్థ గాడిన పడుతోంది.

ఈ క్రమంలో గతేడాది భారీగా క్షీణించిన జీఎస్టీ వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. జనవరి మాసానిక గానూ దాదాపు రూ.1.20 లక్షల కోట్లు వసూలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు అవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

దేశంలో కరోనా విజృంభణకు ముందు గతేడాది జనవరితో పోలిస్తే ఇప్పుడు 8 శాతం అధికంగా వసూలయ్యాయి. గతేడాది ఇదే జనవరి నెలకు రూ.1.11 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలయ్యాయి.  

జనవరి 31 వరకు (సాయంత్రం 6 గంటల వరకు) మొత్తం రూ.1,19,847 కోట్లు కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ కింద రూ.21,923 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.29,014 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.60,288 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది.

సెస్సుల రూపంలో రూ.8,622 కోట్లు సమకూరినట్లు పేర్కొంది. డిసెంబర్‌ నెలకు సంబంధించి జనవరి 31 వరకు 90 లక్షల జీఎస్టీఆర్‌-2బీ రిటర్నులు దాఖలైనట్లు పేర్కొంది. జీఎస్టీ చరిత్రలో ఇప్పటి వరకు గత నెల వసూలైన రూ.1.15 లక్షల కోట్లే రికార్డు కాగా.. ఆ రికార్డును తాజా వసూళ్లు బద్ధలు కొట్టాయి. 

 

 

click me!