పీవీ, మన్మోహన్‌లే ఆదర్శం: మోదీ ప్రభుత్వంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Jan 23, 2019, 10:58 AM IST
Highlights

రోజురోజుకు మారుతున్న పరిణామాల నేపథ్యంలో 28 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు, ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ అమలు చేసిన ఆర్థిక సంస్కరణల విధానమే అందరికీ ఆదర్శం అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. కేంద్రీకరణ విధానాలు కిందిస్థాయిలో పూర్తిగా అమలు కాబోవని స్పష్టం చేశారు. పంట రుణ మాఫీ వల్ల ప్రయోజనం శూన్యమని తేల్చేశారు. 

దావోస్‌: ఆర్థిక సంస్కరణల అమలులో మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు, నాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్‌ సింగ్‌ నుంచే ‘సంస్కరణ పాఠాలు’ నేర్చుకోవాలని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సూచించారు. సంస్కరణల అమలుకు రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం చాలా అవసరమని కూడా చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన రఘురామ్ రాజన్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. మితిమీరిన కేంద్రీకరణ ధోరణులతో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు దిగువ స్థాయిలో ఆచరణకు నోచుకోవని, కొన్నేళ్లుగా మనం చూస్తున్నది అదేనని స్పష్టం చేశారు. 

వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న నిరాశా నిస్పృహలు, సంస్థాగత స్వేచ్ఛ, ఉపాధి వృద్ధి వంటివే కీలకాంశాలు కాగలవని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీ, దివాలా చట్టం వంటివి విజయవంతంగా అమలు చేయగలిగినా కార్మిక, భూసంస్కరణల్లో వెనుకబడి ఉన్నదని చెప్పారు.
 
భారతదేశం వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థే అయినా అధిక ఉద్యోగాల కల్పనకు అది ఒకటే చాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ స్పష్టం చేశారు. వినియోగం, పెట్టుబడులు ఒకదానితో ఒకటి జంటగా సాగినప్పుడే ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 

వ్యవసాయ రుణమాఫీల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదంటూ చెల్లింపు సామర్థ్యం లేని వారికి మాత్రమే అవి అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ అభిప్రాయపడ్డారు. అధికార హోదాల క్రమంలో ఆర్‌బీఐ గవర్నర్‌ స్థానం ఏమిటని తేల్చాల్సి ఉన్నదన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌కు ప్రభుత్వంలో కార్యదర్శి హోదా అధికారి బాధ్యతల నిర్దేశకత్వం చేయడం ఏ మాత్రం సబబు కాదని తేల్చి చెప్పారు.

ఆర్బీఐ గవర్నర్  స్థానం హోదా వరుస క్రమంలో ప్రథముడిగా, ఆర్థికమంత్రికి దిగువన ఉండాలన్నది తన అభిప్రాయమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ తేల్చి చెప్పారు. ఆర్‌బీఐ పాలనా యంత్రాంగంలో భాగం, ప్రభుత్వం కనుసన్నల్లోనే పని చేసే సంస్థైనా దానికి నిర్వహణాపరమైన స్వేచ్ఛ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
 
సాంకేతిక పరిజ్ఞానమే ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రస్తుత యుగంలో ఎన్నో సేవలు ఉచితంగా లేదా చౌకగా అందుబాటులోకి వస్తున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ తెలిపారు. దీనివల్ల వినియోగదారులు ప్రయోజనం పొందుతున్నా ఆ ఉచిత సేవలు కొనసాగుతాయా అన్నది ఒక ప్రశ్న అని అన్నారు. గూగుల్‌ అందిస్తున్న ఉచిత సేవలను ఆయన ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. 

ఏ ఒక్క సేవ ఉచితం కాదన్న సంగతి మన కి తెలుసునని మరి ఆ సేవల వ్యయాన్ని ఎవరు చెల్లిస్తున్నారు, ప్రభుత్వమా లేక ఆ సంస్థలేనా అన్నది మనం అన్వేషించాల్సి ఉన్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ పేర్కొన్నారు. వారు ఉచితంగా సేవలందిస్తున్నారంటే వారు ఎక్కడో అక్కడ సొమ్ము చేసుకుంటున్నారనే కదా అర్ధం అంటూ ఈ రోజు దీని గురించి ఆందోళన ఉండకపోవచ్చు, కాని భవిష్యత్తులో వినియోగదారులకు ఆ ప్రయోజనం కొనసాగుతుందా అన్నది మనం పరిశీలించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

click me!