
కోవిడ్-19 ప్రారంభమైన తర్వాత రైలు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకు మినహాయింపు నిలిపివేశారు. అప్పటి నుండి, రైల్వే ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకు మినహాయింపు అందడం లేదు. అయితే అలాంటి వారికి త్వరలో శుభవార్త రాబోతోంది. కోవిడ్-19 పరిస్థితి సాధారణంగా ఉందని పరిగణనలోకి తీసుకున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్లీపర్ AC-3 తరగతుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్‌లకు రైలు ఛార్జీలపై రాయితీని పునఃప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. ఇది అవసరమైన పౌరులకు సహాయం చేస్తుంది, కమిటీ తెలిపింది. సీనియర్ సిటిజన్లకు, ప్రత్యేకించి స్లీపర్ క్లాస్ కేటగిరీ 3Aకి ఛార్జీలపై రాయితీలను పునఃప్రారంభించడాన్ని "సానుభూతితో" పరిశీలించాలని రైల్వేపై రాధా మోహన్ సింగ్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేయడం ఇది రెండోసారి.
కోవిడ్ కు ముందు 58 ఏళ్లు పైబడిన ఆడవారికి 50 శాతం , 60 ఏళ్లు పైబడిన పురుషులకు. 40 శాతం టిక్కెట్ తగ్గింపు అమల్లో ఉండేది. అన్ని రకాల రైళ్లు, క్యాపిటల్, ఎక్స్‌ప్రెస్, మెయిల్ మొదలైన వాటికి తగ్గింపు వర్తించేది. అయితే ఈ సబ్సిడీని 20 మార్చి 2020 నుంచి తొలగించారు. కోవిడ్ తర్వాత, రైల్వే ఆదాయం మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మునుపటిలా సబ్సిడీ ఇవ్వాలని సిఫార్సు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. ఈ రాయితీలు మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది, గరీబ్ రథ్ సహా అన్ని గ్రూప్ రైళ్లలోని అన్ని తరగతుల ఛార్జీలపై అనుమతించనున్నారు.
రైల్వే శాఖ అందించిన సమాచారం ప్రకారం, ఇప్పుడు కోవిడ్ పరిస్థితి సాధారణమైందని రైల్వే సాధారణ వృద్ధిని సాధించిందని కమిటీ తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రశ్నకు స్పందిస్తూ, “కోవిడ్ -19 మహమ్మారి రైల్వే ఆర్థిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేసింది.అయితే ఇప్పుడు పరిస్థితి కుదుటపడిందని, సబ్సిడీ మొత్తాన్ని వికలాంగులు, విద్యార్థులు రోగులు వంటి అనేక వర్గాలకు విస్తరిస్తామని ఆయన బదులిచ్చారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు రాయితీపై స్పష్టత లేదు. అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచన మేరకు త్వరలోనే ఈ రాయితీ లభించే అవకాశం ఉంది.