
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రీసెంట్ గానే రూ.లక్షకు చేరువైన ఈ బంగారం ధర, వరసగా నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వస్తోంది. ఇలా తగ్గడం చూసి చాలా మంది మళ్లీ తగ్గుతుందిలే అని ఆశపడ్డారు. కానీ, ఆ ఆశలన్నీ మళ్లీ ఆవిరైపోయాయి. ఒక్క రోజులోనే పది గ్రాముల బంగారం రూ.2వేలు పెరిగిపోయింది. ప్రస్తుతం తులం బంగారం రూ.94,708 కి చేరుకోవడం గమనార్హం.
ఈ బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ తగ్గింపు అంచనాలు, డాలర్ బలహీనం, బాండ్ యిూల్డ్ తగ్గడం కూడా కారణం కావచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలు కూడా బంగారం ధర పెరగడానికి కారణం అయ్యాయి అని తెలుస్తోంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (MCX) మే 5 సాయంత్రం 4:50 గంటల సమయంలో బంగారం ధర 2.14 శాతం పెరిగి రూ. 94,708 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర ఒక శాతం కంటే ఎక్కువ పెరిగింది. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై మదుపరులు దృష్టి సారించడంతో ధర పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇదే కంటిన్యూ అవుతుదని చెప్పలేం. ఈ రెండు, మూడు రోజుల్లో బంగారం ధరలు పెరగొచ్చు లేదంటే తగ్గొచ్చు. ఈ బంగారం విషయంలో పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచన ఉంటే మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం.