
సోమవారం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మంగళవారం (మార్చి 15, 2022) కాస్త ఎక్కువగానే తగ్గుముఖం పట్టాయి. ఉదయం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52,000 దిగువకు పడిపోయాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో ధరలు రూ.55,000ను తాకాయి. అయితే యుద్ధం దాదాపు ముగిసి, చర్చల ప్రక్రియ కొనసాగుతుండటంతో పసిడి మార్కెట్ కాస్త ఢీలాపడింది. దీంతో ఈ కొద్ది రోజుల్లోనే వేలల్లో తగ్గింది.
బంగారం ధరలు క్రితం సెషన్‌లో దాదాపు స్థిరంగా ముగిశాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా రూ.8 క్షీణించి రూ.52,296 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.30 తగ్గి రూ.52,867 వద్ద ముగియగా, మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.53 తగ్గి రూ.68,897 వద్ద ముగిసింది. గతవారం రూ.70,000 పైన ముగిసిన సిల్వర్ ఫ్యూచర్స్ ఈ వారం ఈ మార్కు దిగువకు వచ్చింది. అలాగే బంగారం ధరలు రూ.52,000 స్థాయికి వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం చల్లబడిన తర్వాత బంగారం ఈ నాలుగైదు సెషన్‌లలోనే రూ.3500 తగ్గింది.
నేడు ప్రారంభ సెషన్‌లో పసిడి ధరలు రూ.400 వరకు తగ్గాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.380 తగ్గి రూ.51,924 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.368 క్షీణించి రూ.52,529 వద్ద ట్రేడ్ అయింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.622 క్షీణించి రూ.68,222 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.626 తగ్గి రూ.69,050 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52,000 దిగువకు, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 దిగువకు వచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో గతవారం పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం (2075 )సమీపానికి చేరుకున్నాయి. 2050 డాలర్లను సమీపించింది. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తగ్గిన నేపథ్యంలో ఈ కాలంలో 100 డాలర్లకు పైగా క్షీణించాయి. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ 1943 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.