భయపెడుతున్న బంగారం ధరలు.. సరికొత్త రికార్డు స్థాయికి పసిడి ధర...?

By Sandra Ashok KumarFirst Published May 21, 2020, 11:30 AM IST
Highlights

అమెరికాతో వాణిజ్య యుద్ధం.. కరోనా మహమ్మారి నెలకొల్పిన సంక్షోభం దాని కొనసాగింపుగా అమెరికా, చైనా మధ్య ఘర్షణాత్మక వాతావరణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాదికల్లా కోలుకుంటుందని చెప్పడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా పసిడిపైకి తమ పెట్టుబడులను మళ్లించారు.
 

న్యూఢిల్లీ: దక్షిణ భారతదేశంలో పసిడి ధరలు భగ్గు భగ్గుమని తారా జువ్వల్లా పైపైకి దూసుకెళుతున్నాయి. గతేడాది అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం.. తాజాగా కరోనా మహమ్మారి ప్రభావంతో వివిధ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం కొంత సడలింపులు ఉన్నా.. ఆంక్షలు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో మదుపర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా పసిడి కనిపిస్తున్నది. 

దేశవ్యాప్తంగా కరోనా ‘లాక్ డౌన్’ సడలింపులు కాస్త సడలించడంతో విపణిలో కార్యకలాపాలు పుంజుకున్నాయి. చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కూడా బంగారం ధర పెరిగిపోవడానికి కారణమయ్యాయి. బుధవారం మార్కెట్లో పది గ్రాముల (24 క్యారెట్ల) బంగారం ధర సరికొత్త రికార్డులు నమోదు చేసింది. బెంగళూరులో పది గ్రాముల బంగారం రూ.840 పెరిగి రూ.47,660కి చేరుకుంది. 

భారత సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరులో మాదిరిగానే మెట్రోపాలిటన్ నగరాల్లో బంగారం ధరలు పైపైకి దూసుకెళ్లాయి. పది గ్రాముల (22 క్యారెట్ల) బంగారం ధర రూ.44,910 పలికితే, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.48,990 వరకూ దూసుకెళ్లింది. హైదరాబాద్ నగరంలో తులం (24 క్యారెట్లు) బంగారం రూ.48,990గానే ఉన్నా 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.45,990 వద్ద స్థిర పడింది. 

also read 

కేరళలో పది గ్రాముల (22 క్యారెట్ల) బంగారం ధర రూ.43,860కాగా, 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.47,840గా ఉంది. ఇక విశాఖపట్నం నగర పరిధిలో పది గ్రాముల బంగారం ధర (22 క్యారెట్లు) రూ.45,920గా ఉంటే 24 క్యారెట్ల బంగారం రూ.48,990గా రికార్డయింది. 

ఇక దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి తులం ధర రూ.47,350లకు పెరిగితే, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ ధర రూ.47,354లకు చేరుకున్నది. ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ఆధారంగా తులం బంగారం ధర రూ.47,356 పలికితే, కిలో వెండి ధర రూ.48,315గా రికార్డయింది. 

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.2 శాతం పెరిగి 1746.58 డాలర్లు పలికింది. ఔన్స్ బంగారం ధర 1730 డాలర్లకు కొద్దిసేపు మద్దతు పలికినా తర్వాత గరిష్ఠంగా 1755 డాలర్లకు దూసుకెళ్లింది. దేశీయంగా పసిడి ధరలు పెరిగిపోవడానికి డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం కావడం కూడా ఒక కారణమే. అమెరికా ఫెడ్ రిజర్వు చైర్మన్ కూడా దేశీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటుందని ప్రకటించడం వల్ల కూడా ఇన్వెస్టర్లు పసిడిపై పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. 
 

click me!