ఆరునెలల్లో 11వేలు పెరిగిన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?

By Sandra Ashok KumarFirst Published Jul 9, 2020, 11:12 AM IST
Highlights

పసిడి ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బుధవారం బులియన్ మార్కెట్లో హైదరాబాద్ నగరంలో రూ.51 వేలకు తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 1800 డాలర్లు పలుకుతున్నది.

న్యూఢిల్లీ: పరుగు పందెంలో పుత్తడి ధర దూసుకుపోతున్నది. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న బంగారం మరో మైలురాయికి చేరువైంది. 

దేశయంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు బంగారం ధర ఏకంగా రూ.11 వేలు అధికమైంది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర మరో రూ.370 పెరిగి ఏకంగా రూ.51 వేలకు చేరువైంది.

బుధవారం బులియన్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.50,990 వద్ద నిలిచింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర మరో రూ.723 పెరిగి రూ.49,898 పలికింది. 

అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాలకు డిమాండ్‌ నెలకొంది. ఔన్స్ బంగారం 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పుత్తడి ధర చేరుకుంది. గ్లోబల్‌ రేట్లకు తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం బంగారం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని బులియన్‌ వర్తకులు అంటున్నారు. 

వారం రోజులుగా భారీగా పెరిగిన వెండి స్వల్పంగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల డిమాండ్‌ లేక కిలో వెండి రూ.100 తగ్గి రూ.50,416కి పరిమితమైంది. ఇతర నగరాల్లోనూ ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనాతో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో బంగారం కొనేదానిపై ఆలోచన కూడా చేయడం లేదని ఢిల్లీకి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అభిప్రాయపడ్డారు. 

also read 

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానికి డిమాండ్‌ కొనసాగుతోంది. వెరసి విదేశీ మార్కెట్లో ఔన్స్‌(31.1 గ్రాములు) 1800 డాలర్లను అధిగమించింది. ఇది 2011 తదుపరి అత్యధిక ధర. కేంద్ర బ్యాంకులతోపాటు సామాన్యుల వరకూ సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా పసిడిని భావిస్తుండటమే దీనికి కారణమని బులియన్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.  

ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో అంటే ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం ఆగస్ట్‌ గోల్డ్‌ 0.75 శాతం పుంజుకుని 10 గ్రాములు రూ. 49,165కు చేరింది. ఇదే విధంగా వెండి కేజీ జులై ఫ్యూచర్స్‌ రూ. 51,594ను తాకింది. బుధవారం పసిడి ఫ్యూచర్స్‌ రూ. 49,045 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి (ఫ్యూచర్స్‌) 1821 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ ధర 1811 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్స్‌ 19.22 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశీయ రిఫైనరీలలో శుద్ధి చేసిన పసిడి బార్లను అనుమతించనున్నట్లు ఎంసీఎక్స్‌ తాజాగా పేర్కొంది. అయితే ఇందుకు నియంత్రణ సంస్థలు అనుమతించవలసి ఉన్నట్లు తెలిపింది. మరోపక్క గోల్డ్‌ మినీ ఆప్షన్స్‌(100 గ్రాములు) ప్రవేశపెట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు పేర్కొంది.

అమెరికాలోని పలు రాష్ట్రాలలో కోవిడ్‌(సెకండ్‌ వేవ్‌) విస్తరిస్తుండటంతో ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి సహాయక ప్యాకేజీల రూపకల్పనకు ఉపక్రమించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో పసిడికి డిమాండ్‌ పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

click me!