సామాన్యుడు కొనలేని స్థాయికి బంగారం ధరలు.. 10గ్రా ఎంతంటే ?

By Sandra Ashok KumarFirst Published Jun 12, 2020, 12:19 PM IST
Highlights

పసిడి ధరలు కొండెక్కుతున్నాయి. తులం బంగారం ధర రూ.48,190 వద్ద ముగిసింది. శుక్రవారం ప్యూచర్స్ మార్కెట్లో బులియన్ మదుపర్లు లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టారు.
 

న్యూఢిల్లీ: బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. వరుసగా ఐదు రోజులుగా పెరుగుతున్న పసిడి రూ.48 వేలు దాటింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర ఏకంగా రూ.477 అధికమై  రూ.48,190 వద్ద ముగిసింది.

ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనం చెందడం, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించారు. దీంతో గత ఆరు రోజుల్లో బంగారం ధర రూ.1,500కి పైగా అధికమైంది. వెండి స్వల్పంగా పెరిగి రూ.50 వేలకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,735 డాలర్లకు, వెండి 17.86 డాలర్లకు తగ్గాయి.

మరోవైపు, దేశీయ పసిడి ఫ్యూచర్స్ మార్కెట్‌లో శుక్రవారం లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా శుక్రవారం ఉదయం సెషన్‌లో 10గ్రాములు పసిడి ధర రూ.350 నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరిమిత శ్రేణిలో ట్రేడ్‌ అవుతుండటం కూడా పసిడి ఫ్యూచర్ల విక్రయాలకు కొంత కారణమైంది.

also read కోట్ల కొలువులు గోవిందా.. పేదల బతుకు ఆగమాగం.. ఓఈసీడీ హెచ్చరిక

శుక్రవారం ఉదయం 10గంటకు ఆగస్ట్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర నిన్నటి ముగింపు ధర రూ.47414తో పోలిస్తే రూ.265లు నష్టపోయి రూ.47140 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగా పసిడి ధర వారం గరిష్టానికి తాకడం, ఈక్విటీల్లో భారీ పతనంతో ఇన్వెస్టర్ల రక్షణాత్మక సాధనమైన పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

దీంతో గురువారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి రూ.788 లాభపడి రూ. 47414 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్‌ ధర పరిమిత శ్రేణిలో ట్రేడ్‌ అవుతోంది. పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్‌ బలపడటం ఇందుకు కారణమవుతోంది.

ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ఫ్యూచర్స్‌ ధర నాలుగు డాలర్లు క్షీణించి 1735 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల రోజుల్లో పసిడి ఫ్యూచర్లు చెప్పుకొదగిన ర్యాలీ చేసిన నేపథ్యంలో కొంతమేర లాభాల స్వీకరణకు జరిగినట్లు బులియన్‌ నిపుణులు చెబుతున్నారు.

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను కనిష్టస్థాయిలో యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో నిన్నటి ట్రేడింగ్‌ వారం గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మార్చి నెల మధ్యలో పసిడి ధర మూడు నెలల కనిష్టాన్ని తాకిన నాటి నుంచి పసిడి ధర 20 శాతం ర్యాలీ చేసింది.
 

click me!