
గతంలో 5G లైసెన్సుల కోసం ఆదానీ గ్రూపు పోటీ పడింది. అప్పుడే టెలికాం రంగంలోకి అడుగుపెట్టబోతోందనే సూచనలు బయటకు వచ్చాయి. అయితే కేవలం తమ కంపెనీ డేటా సెంటర్‌లతో పాటు సూపర్ యాప్‌ల కోసం 5G ఎయిర్‌వేవ్‌లను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. విద్యుత్ పంపిణీ నుండి విమానాశ్రయాలు, పోర్టులు, గ్యాస్ రిటైల్ అమ్మకానికి ఈ 5G నెట్ వర్క్ ఉపయోగిస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే PTI వార్తల ప్రకారం,అదానీ డేటా నెట్‌వర్క్‌లకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, ముంబైలోని ఆరు సర్కిళ్లలో టెలికమ్యూనికేషన్ శాఖ నుండి ఏకీకృత లైసెన్స్‌ను పొందినట్లు తెలిపింది.
ముఖేష్ అంబానీతో ప్రత్యక్ష పోటీ?
ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ ఇద్దరూ గుజరాత్ నుండి వచ్చిన పారిశ్రామికవేత్తలు. ఇప్పటి వరకు రెండు గ్రూపులు వేర్వేరు రంగాల్లో పనిచేస్తున్నాయి. , వారి మధ్య ప్రత్యక్ష పోటీ లేదు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ చమురు, రిఫైనరీ , పెట్రోకెమికల్స్ నుండి టెలికాం , రిటైల్ రంగాల వరకు నిర్వహిస్తోంది.
అదే సమయంలో, అదానీ గ్రూప్ ఓడరేవులు, బొగ్గు, గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ పంపిణీ , విమానయాన రంగాలలో ఉంది. అయితే ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ పెట్రో కెమికల్ రంగంలోకి అడుగుపెట్టగా, రిలయన్స్ గ్రూప్ కూడా గ్రీన్ ఎనర్జీ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు టెలికాం రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశం ద్వారా వీరిద్దరి మధ్య మొదటి ప్రత్యక్ష పోటీకి రంగం సిద్దమవుతోంది.
టెలికాం రంగంలో గట్టి పోటీ
అయితే టెలికాం వ్యాపారంపై అదానీ గ్రూప్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. టెలికాం సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్న గౌతమ్ అదానీ సంస్థ ఈ లైసెన్స్ పొందిన తర్వాత ఇప్పుడు తన 5G సేవలను విస్తరించే అవకాశం కలిగింది. దీనితో పాటు, ఈ రంగంలో ఇప్పటికే ఉన్న దిగ్గజాలైన Jio (JIO), Airtel , Vodafone-Idea వంటి కంపెనీలకు అదానీ గట్టి పోటీని ఇవ్వబోతున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ మొదలైంది.
212 కోట్లకు స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది
ఇటీవల ముగిసిన 5G స్పెక్ట్రమ్ వేలంలో అదానీ గ్రూప్ 20 సంవత్సరాలకు 400 MHz స్పెక్ట్రమ్‌ను 212 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం గమనార్హం. ఈ కొనుగోలుతో, గౌతమ్ అదానీ వేలంలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడం ద్వారా దేశంలోని టెలికాం రంగంలోకి ప్రవేశించారు. అయితే, ఆ సమయంలో ఈ స్పెక్ట్రమ్‌ను గ్రూప్‌లోని వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగిస్తామని కంపెనీ చెబుతోంది.
అంబానీ అత్యధికంగా ఖర్చు చేశారు
రూ.88,078 కోట్లు వెచ్చించి 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు రేసులో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ముందు వరుసలో ఉంది. కాగా, భారతీ ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు వెచ్చించి రెండో స్థానంలో ఉండగా, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్లు వెచ్చించి మూడో స్థానంలో ఉంది.