
దేశంలోని పెద్ద నగరాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది. ట్రాఫిక్ జామ్ తగ్గించడానికి ఫ్లయింగ్ బస్సులు, అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు వంటి ప్రజా రవాణా వ్యవస్థల కోసం ఇండియా చురుగ్గా పనిచేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో అడ్వాన్స్ టెక్నాలజీ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ గురించి వివరించారు.
ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఏరియల్ పాడ్ వ్యవస్థలు, ఫ్లాష్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరాల్లో ట్రాఫిక్ జామ్ నుంచి ఉపశమనం కలిగించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అంతేకాకుండా లాంగ్ జర్నీల వల్ల ఇబ్బందులు, ప్రయాణికుల అలసట తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రణాళికల్లో ఉందన్నారు. పూణేలో కూడా ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. వర్షాకాలంలో ట్రాఫిక్ జామ్ కు కుప్రసిద్ధి చెందిన బెంగళూరులో కూడా ఇలాంటి అధ్యయనం జరుగుతోందని నితిన్ గడ్కరీ చెప్పారు.
ఇండియాలో ఫ్లయింగ్ బస్సుల ఏర్పాటు ప్రధానంగా పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (PRT) రూపంలో ఉంటుంది. అంటే ఏరియల్ పాడ్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఇవి చిన్న, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ వాహనాల్లాంటివి. ఇవి పైనున్న ట్రాక్ లపై వేలాడుతూ వెళ్తాయి. లేదా వాటిపై నుంచి ప్రయాణిస్తాయి. ఈ వాహనాలు టాక్సీల మాదిరిగా పనిచేస్తాయి. అంటే మీరు ఒక పాడ్ ని బుక్ చేసుకుంటే అది మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నేరుగా మీరు వెళ్లాల్సిన చోటుకు చేరుస్తుంది. ప్రతి పాడ్ లో ఇద్దరు నుంచి ఆరుగురు వరకు ప్రయాణించవచ్చు.
నాగ్‌పూర్‌లో అతివేగంగా వెళ్లే ఫ్లాష్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించినట్లు గడ్కరీ తెలిపారు. 135 సీట్ల ఈ బస్సు గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ప్రయాణికులు ఎక్కడానికి, దిగడానికి ప్రతి 40 కి.మీ.కు 30 సెకన్లు మాత్రమే ఆగుతుంది. ఆ సమయంలో ఈ బస్సు ఛార్జ్ అవుతుంది. ఈ బస్సులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ సీట్లు, ప్రతి సీటు ముందు టీవీ ఉంటాయి. తక్కువ బ్యాటరీ శక్తితో నడిచే ఈ బస్సు, డీజిల్ బస్సుల కంటే దాదాపు 30 శాతం చౌకగా ఉంటుందని నితిన్ గడ్కరీ చెప్పారు.
విమానాల్లో ఎయిర్ హోస్టెస్ ల మాదిరిగా బస్సుల్లో బస్ హోస్టెస్ లు ఉంటారు. డీజిల్ బస్సుల కంటే ఈ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జీలు 30 శాతం తక్కువగా ఉంటాయి. నాగ్‌పూర్ మోడల్ విజయవంతంగా అమలైన తర్వాత ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-డెహ్రాడూన్, బెంగళూరు-చెన్నై, ముంబై వంటి నగరాలకు ఈ సేవను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోందని నితిన్ గడ్కరీ చెప్పారు.