మింత్రా, జబాంగ్‌లకు సీఈఓగా అనంత్ నారాయణ్ గుడ్‌బై

By narsimha lodeFirst Published Jan 15, 2019, 11:43 AM IST
Highlights

ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్ కార్ట్ అనుబంధ మింత్రా, జబాంగ్‌ సీఈవో అనంత్‌ నారాయణన్‌ ఆ స్థానం నుంచి వైదొలిగినట్లు మింత్రా సోమవారం ప్రకటించింది. ఆయన సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నట్లు కొద్ది నెలలుగా ఊహాగానాలు ఉన్నాయి


ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్ కార్ట్ అనుబంధ మింత్రా, జబాంగ్‌ సీఈవో అనంత్‌ నారాయణన్‌ ఆ స్థానం నుంచి వైదొలిగినట్లు మింత్రా సోమవారం ప్రకటించింది. ఆయన సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నట్లు కొద్ది నెలలుగా ఊహాగానాలు ఉన్నాయి. మింత్రా-జబాంగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ పరం కావడంతో యాజమాన్యం నూతన విధానాలు అమలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 
నారాయణన్‌ స్థానంలో అమర్‌ నాగారం బాధ్యతలు స్వీకరిస్తారని, ఈయన ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తికి ఎప్పటికప్పుడు పరిస్థితులను నివేదిస్తారని మింత్రా సంస్థ ప్రకటనలో వెల్లడించింది. ఆచరణాత్మక సమస్యల రీత్యా మింత్రా సంస్థలో సీఈఓ పోస్టును రద్దు చేసినట్లు ప్రకటించింది. 

‘ఫ్యాషన్‌ ఈ-కామర్స్‌’ రంగంలో మింత్రా, జబాంగ్‌లను అనంత్‌ నారాయణన్‌ ప్రత్యేకంగా నిలబెట్టారు. సంస్థను స్థిరమైన వృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లారు. మూడున్నరేళ్ల నుంచి నారాయణన్‌తోపాటు అతని బృందం సంస్థ పటిష్ఠత కోసం బాగా కృషి చేసింది. ఇకపై ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపులో భాగమై ఉండే మింత్రా, జబాంగ్‌ విలువైన వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తాం. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి వ్యూహాత్మకమైన విధానాలతో స్థిరమైన వృద్ధి సాధిస్తాం’అని మింత్రా సంస్థ ప్రకటనలో తెలిపింది.

కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న అమర్ నాగారం, ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మింత్రాలో చేరారు. ఇంతకుముందు మింత్రా చీఫ్ ప్రొడక్ట్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఈయన ఏడేళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో అడుగుపెట్టారు. అనంత్‌ నారాయణన్‌ హాట్‌స్టార్‌ సంస్థలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓలాలో వాటాలు కొనుగోలు చేసిన సచిన్‌ బన్సల్‌
బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ 21 మిలియన్‌ డాలర్లను వెచ్చించి క్యాబ్‌ సర్వీసుల దిగ్గజం ఓలాలో వాటాలను కొనుగోలు చేశారు. ఫ్లిప్‌కార్టులోని తన వాటాలను వాల్‌మార్ట్‌కు విక్రయించి సంస్థ నుంచి బయటకొచ్చాక పెట్టిన తొలి పెట్టుబడి ఇదే. ఒక్కో షేర్ రూ.21,250 చొప్పున 70,588 జే ప్రిఫరెన్స్‌ షేర్లను కొనుగోలు చేశారు. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వద్ద సమర్పించిన పత్రాల్లో ఈ సంగతి చెప్పారు. బన్సల్‌ మొత్తం 150 మిలియన్‌ డాలర్లు ఓలాలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఓలా మార్కెట్‌ విలువ 5.7 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఓలాలో వ్యక్తిగత రూపంలో వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఇదే. ఇప్పటికే ఓలాలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ 26శాతం వాటాను కలిగి ఉంది.

click me!