ఈక్విటీ ఆక్సిజన్: జెట్ ఎయిర్వేస్‌కు ఎతిహాద్ అండ

By narsimha lodeFirst Published Jan 15, 2019, 11:38 AM IST
Highlights

కష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆదుకునేందుకు ఎతిహాద్‌ కీలక చర్యలు చేపట్టింది. జెట్ ‌ఎయిర్‌వేస్‌లో తన వాటాను 49శాతానికి పెంచుకోవాలని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ పీజేఎస్‌సీ నిర్ణయించింది

లండన్‌: కష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆదుకునేందుకు ఎతిహాద్‌ కీలక చర్యలు చేపట్టింది. జెట్ ‌ఎయిర్‌వేస్‌లో తన వాటాను 49శాతానికి పెంచుకోవాలని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ పీజేఎస్‌సీ నిర్ణయించింది. ఇందుకోసం జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్‌ నరేశ్ గోయల్‌ తన వాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌లో నరేశ్ గోయల్‌కు 51శాతం వాటా ఉంది. ఈ డీల్‌ అనంతరం ఆయన వాటా 20శాతం కంటే దిగువకు పడిపోనుంది. దీంతోపాటు ఆయనకు 10శాతం ఓటింగ్‌ హక్కులు లభించనున్నాయి. దీనిపై ఇరువర్గాల నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. అయితే ఈ అంశంలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు.

మరోపక్క మార్కెట్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు 19శాతం లాభపడ్డాయి. నవంబర్‌ 15 నుంచి ఇప్పటి వరకు ఈ షేర్‌ కౌంటర్‌లో వచ్చిన అతిపెద్ద లాభం ఇదే. దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థగా పేరొందిన జెట్‌ ఎయిర్‌వేస్‌ గత 11ఏళ్లలో తొమ్మిదేళ్లుగా నష్టాలే చవిచూసింది. ప్రస్తుతం ఎతిహాద్‌కు మొత్తం 24శాతం వాటాలు ఉన్నాయి. భారత్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ ‌సంస్థలో విదేశీ సంస్థలు 49శాతం మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. దీంతో ఎతిహాద్‌ ఆ మేరకే వాటాలను కొనుగోలు చేయనుంది.

మరోవైపు జెట్ ఎయిర్వేస్‌లో 24 శాతం వాటా గల ఎతిహాద్, రుణ దాతలైన బ్యాంకర్లతో నరేశ్ గోయల్ ప్రతినిధులు చర్చలు జరిపింది. ప్రత్యేకించి బ్యాంకర్ల వద్ద జెట్ ఎయిర్వేస్ తదుపరి రుణాలు తీసుకునేందుకు గ్యారంటీగా ఉండాలంటే షరతులు వర్తిస్తాయని ఎతిహాద్ వర్గాలు చెప్పాయి. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుత సెటప్‌లో బ్యాంకులు కూడా ఈక్విటీ నిధుల కింద రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం.

నిధులు లేక విమానాశ్రయాలకు పరిమితమైన విమానాలు, సిబ్బందికి అందని వేతనాలు, లాభసాటి గానీ మార్గాల్లో విమాన సర్వీసులను రద్దు చేయడం వంటి పొదుపు చర్యలను జెట్ ఎయిర్వేస్ చేపట్టింది. కానీ అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ఎతిహాద్, ఇతర ఇన్వెస్టర్లు కూడా జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేశ్ గోయల్ తన వాటాను, యాజమాన్య హక్కులను వదులుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

click me!