
ఏ దేశ ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారో తెలిపే ఓ జాబితా విడుదలైంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ రిపోర్ట్ 2025 దీన్ని రిలీజ్ చేసింది. ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా తన స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకుంది. ఒక దేశం అభివృద్ధి అక్కడి ప్రజల సంతోషం మీద ఆధారపడి ఉంటుందని ఫిన్లాండ్ నిరూపించింది. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ రెండో దేశంగా నిలిచింది. ఇండియా ఏ స్థానంలో ఉందో తెలుసుకుందామా?
ఫిన్లాండ్ వరుసగా చాలా సంవత్సరాలుగా సంతోషకరమైన దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి సహజ సౌందర్యం, ముఖ్యంగా నార్తర్న్ లైట్స్, ప్రశాంత వాతావరణం, సమతుల్య జీవనశైలి ప్రజలను మానసికంగా, సంతోషంగా ఉంచుతాయి.
డెన్మార్క్ సామాజిక సమానత్వం, బలమైన సంక్షేమ వ్యవస్థ, అధిక కొనుగోలు శక్తికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పౌరులు తమ జీవిత నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోగలుగుతారు. అందుకే ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తారు.
ఐస్లాండ్ ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాలలో ఒకటి. ఇక్కడ అగ్నిపర్వతాలు, హిమానీనదాలు, అద్భుతమైన జలపాతాలు వంటి సహజ దృశ్యాలు ప్రజలకు ప్రశాంతతను కలిగిస్తాయి. అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఈ దేశం 3వ స్థానంలో ఉంది.
సంతోషకరమైన దేశాల జాబితాలో స్వీడన్ టాప్-4 స్థానం సంపాదించింది. స్వీడన్ ఆవిష్కరణ రూపకల్పన, సహజ సౌందర్యం, సామాజిక భద్రతా వ్యవస్థ కారణంగా అత్యంత సంతోషకరమైన దేశాలలో ఒకటి.
గాజా సంఘర్షణ మధ్య జరుగుతున్నా కూడా ఇజ్రాయెల్ 5వ స్థానంలో నిలవడం విశేషం. దీనికి ప్రధాన కారణం అక్కడి పౌరుల జీవన విధానం, సంతృప్తిగా జీవించేలా వారి ఆలోచనలు ఉండటం.
ఈ నివేదిక ప్రకారం ఇండియా 126వ స్థానంలో ఉంది. ఇండియా ర్యాంకింగ్‌లో అనేక సామాజిక, పర్యావరణ సవాళ్ల ప్రభావం కనిపించింది. ఈ ర్యాంకింగ్ 6 వర్గాలపై ఆధారపడి ఉందని నివేదిక పేర్కొంది.
1. తలసరి GDP
2. సామాజిక మద్దతు
3. ఆరోగ్యకరమైన జీవితకాలం
4. జీవిత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ
5. ప్రజల ఉదారత
6. దేశంలో అంతర్గత, బాహ్య అవినీతి అవగాహన
వీటిని పరిగణలోకి తీసుకొని ఇండియాకు 126వ ర్యాంకు ఇచ్చినట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
ఇండియా జనాభా చాలా ఎక్కువ. కానీ టాప్ 5లో చోటు సంపాదించిన దేశాల జనాభా చాలా తక్కువ. ఫిన్లాండ్ జనాభా 55 లక్షలు మాత్రమే. డెన్మార్క్ 59 లక్షలు. ఐస్లాండ్ 3.75 లక్షలు, స్వీడన్ 1 కోటి, ఇజ్రాయెల్ జనాభా 91 లక్షలు. జనాభా కూడా సంతోషానికి ఒక కారణం కావచ్చు. ఇండియాలో జనాభా ఎక్కువ కాబట్టి కొన్ని ప్రాంతాల్లో జనాభా సంతోషంగా జీవించలేకపోవచ్చు. అలా అని ఇండియా మొత్తం సంతోషంగా లేదని అర్థం కాదు.