ఎగుమతులులో వరుసగా నాలుగో నెల కూడా నిరాశే...వాణిజ్య లోటు రూ.12 బిలియన్ డాలర్లు

By Sandra Ashok KumarFirst Published Dec 14, 2019, 10:48 AM IST
Highlights

కేంద్రం, విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఎంత సమర్థించుకున్నా నవంబర్‌ ఎగుమతుల్లో మైనస్‌ 0.34 శాతం క్షీణత నమోదైంది. తద్వారా నాలుగో నెలలోనూ ఎగుమతుల్లో తిరోగమనం రికార్డైంది. దిగుమతుల్లోనూ క్షీణత నమోదైంది. 38.11 బిలియన్ డాలర్ల విలువ చేసే దిగుమతులు తగ్గాయి. దీంతో వాణిజ్యలోటు 12 బిలియన్‌ డాలర్లుగా రికార్డైంది.

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు వరుసగా నాలుగో నెలలోనే నిరాశే మిగిల్చాయి. అసలు వృద్ధిలేకపోగా మైనస్ 0.34 శాతం క్షీణత నమోదు చేసుకున్నాయి. ఎగుమతుల విలువ 25.98 బిలియన్‌ డాలర్లు. ఇక క్షీణత బాటలో ఉన్న దిగుమతులూ మైనస్ 12.71 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి దిగుమతుల విలువ 38.11 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 12.12 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2018 నవంబర్‌లో వాణిజ్యలోటు 17.58 బిలియన్‌ డాలర్లు. కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిద్దాం.

also read  జీఎస్టీ పెంపుపై ఊసే లేదు...అంతా ట్రాష్ అన్న ‘నిర్మల’మ్మ

పెట్రోలియం ఉత్పత్తుల్లో మైనస్ 13.12 శాతం, రత్నాలు అండ్ ఆభరణాల్లో మైనస్8.14 శాతం, పండ్లు–కూరగాయల విభాగంలో మైనస్ 15.10% వ్రుద్ధిరేటు నమోదైంది. ఇక తోలు ఉత్పత్తుల విభాగంలో మైనస్ 5.29%, రెడీమేడ్‌ దుస్తుల మైనస్ 6.52 శాతం వ్రుద్ధిరేటు నమోదైంది. ఎగుమతులకు సంబంధించి దాదాపు 30 కీలక రంగాల్లో 17 క్షీణతను నమోదు చేసుకున్నాయి.  

మరోవైపు పసిడి దిగుమతులు నవంబర్‌లో 6.59 శాతం ఎగబాకాయి.  2.94 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.  చమురు దిగుమతులు మైనస్ 18.17% పడిపోయి 11.06 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతుల విలువ 10.26 శాతం తగ్గి 27.04 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  

ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ చూస్తే ఎగుమతులు 1.99 శాతం పడిపోయి 211.93 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 8.91 శాతం పడిపోయి 318.78 బిలియన్‌ డాలర్లకు చేరాయి.కాగా, అక్టోబర్‌లో సేవల ఎగుమతులు 5.25 శాతం పెరిగాయి. ఈ ఎగుమతుల విలువ 17.70 బిలియన్‌ డాలర్లు. ఎగుమతుల విలువ మాత్రం దాదాపు యథాతథంగా 10.86 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

2018 అక్టోబర్‌లో సేవల ఎగుమతుల విలువ 16.82 బిలియన్‌ డాలర్లు. దిగుమతుల విలువ 10.10 బిలియన్‌ డాలర్లు. భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల వాటా దాదాపు 55 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.   

also read ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్

ఈఈపీసీ ఇండియా చైర్మన్‌ రవి సింఘాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘2019 నవంబర్‌లో ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో వృద్ధి 6.32 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే, విదేశీ వాణిజ్య పరిస్థితులు సవాళ్లమయంగా కనిపిస్తోంది. ప్రపంచమార్కెట్లో మరింతగా పోటీపడేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం’ అని చెప్పారు. 

ఆర్థిక వ్యవస్థలో బలహీనత నమోదు చేసుకున్నదని ఐసీఆర్ఏ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. గణాంకాలు చూస్తుంటే, ఆర్థిక వ్యవస్థలో బలహీన డిమాండ్‌కు అద్దం పడుతోందన్నారు. ఆయిల్, రవాణా తదితర పరికరాల దిగుమతులు క్షీణతలో ఉండడం ఇక్కడ గమనార్హం.

click me!