Explainer: GoFirst ఎయిర్ లైన్స్ ఎందుకు దివాళా తీసింది...విమానాల్లో ఆయిల్ పోసేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి

By Krishna AdithyaFirst Published May 3, 2023, 3:27 PM IST
Highlights

ఓ అమెరికన్ విమాన ఇంజన్ల సంస్థ చేసిన తప్పిదానికి భారతీయ  ఎయిర్లైన్స్ సంస్థ మూల్యం చెల్లించుకోబోతుంది. సకాలంలో విమాన ఇంజన్ల ఆర్డర్ ను అమెరికా సంస్థ అందించకపోవడంతో,  సరిగ్గా సర్వీసులు నడపలేక గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ దివాలా తీసింది.   

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వాడియా గ్రూప్‌కు చెందిన గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ మే 3, 4, 5 తేదీల్లో తన అన్ని విమానాలను రద్దు చేసింది. తమ విమానయాన సంస్థ దివాలా తీసిందని, ఈ మేరకు NCLTలో స్వచ్ఛంద దివాలా ప్రక్రియ కోసం కంపెనీ దరఖాస్తు చేసింది. అంతేకాదు విమానాలు నడిపేందుకు తమ వద్ద ఆయిల్ డబ్బులు సైతం లేవని కంపెనీ తెలిపింది. చమురు కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేందుకు సైతం కంపెనీ వద్ద డబ్బులు లేవని తెలిపింది. దీంతో ఈ నెల 3, 4, 5 తేదీల్లో తమ అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేయాలని సంస్థ నిర్ణయించుకుంది. 

అమెరికా కంపెనీ చేసిన తప్పుకు గో ఫస్ట్ బలి..

తీవ్రమైన నిధుల కొరత కారణంగా GoFirst ఎయిర్‌లైన్ ప్రస్తుతం మూడు రోజుల పాటు తన విమానాలను నిలిపివేసింది. తాము ఆర్థికంగా దివాలా తీయడం వెనుక ఓ అమెరికన్ విమాన ఇంజిన్ కంపెనీ కారణం అని నిందించింది. ఎందుకంటే వారు అమెరికన్ కంపెనీ ప్రాట్ & విట్నీ నుండి ఆర్డర్ చేసిన విమాన ఇంజిన్‌లు సకాలంలో పొందలేకపోయామని. దీంతో ఉన్న విమానాల్లో ఇంజిన్ వైఫల్యాల కారణంగా ఆర్థిక భారం పెరిగిపోయిందని, ఫలితంగా తమ విమానాలు గాలిలో ఎగరలేకపోయాయని ఎయిర్ లైన్స్ పేర్కొంది. గోఫాస్ట్ ఎయిర్‌లైన్ US-ఆధారిత P&W ఇంటర్నేషనల్ ఏరో ఇంజిన్స్ (ప్రాట్ & విట్నీ ఇంటర్నేషనల్ ఏరో ఇంజిన్స్) నుండి సరఫరాలో కొనసాగుతున్న సమస్యలను పేర్కొంది.

సకాలంలో ఇంజన్ ఆర్డర్ అందక గాల్లోకి ఎగరని గో ఫస్ట్..

ఏప్రిల్ 27, 2023 నాటికి GoFirst ఎయిర్‌లైన్ ఆర్డర్ చేసిన ఇంజిన్లలో కనీసం 10 స్పేర్ లీజు ఇంజిన్‌లు, మరో 10 ఇంజిన్‌లను అమెరికన్ ఇంజిన్ కంపెనీ P&W డెలివరీ చేయాలి. కానీ P&W ఆర్డర్‌ను సకాలంలో అందించలేదు. ఇది కంపెనీ ఆదాయంపై ప్రభావం చూపింది. ఫలితంగా డిమాండ్ కు తగిన విమానాలు నడపలేకపోయాయి. కంపెనీ నడుపుతున్న విమాన ఇంజిన్లలో వైఫల్యాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. విఫలమైన ఇంజిన్ల సంఖ్య విపరీతంగా పెరగడంతో, పలు మార్లు టేకాఫ్‌ లను సైతం ఆపవలసి వచ్చింది. కంపెనీకి చెందిన ఇంజన్లు లోపాలు ఉండటం, సమయానికి ఆర్డర్ చేసిన కొత్త ఇంజన్ల డెలివరీ కాకపోవడం వల్ల GoFirstకు చెందిన 50 శాతం విమానాలు నేలపైనే ఉండిపోయాయి. P&W ఇంజిన్ సరఫరాను పూర్తి చేస్తే, ఆగస్ట్-సెప్టెంబర్ 2023 నాటికి ఎయిర్‌లైన్ పూర్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, GoFirst తెలిపింది. 

పెరిగిన నిర్వాహణ ఖర్చులతో కంపెనీ కుదేలు

ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌లను రిపేర్ చేయడంతో పాటు, విడిభాగాలను అందించడంలో P&W విఫలమైందని కంపెనీ తెలిపింది. దీంతో 50 శాతం విమానాలు నిలిచిపోయాయి. విమాన కార్యకలాపాలకు అంతరాయం కొనసాగింది. నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులు పెరిగిపోయాయి. ఈ పరిస్థితికి సంబంధించి, P&W ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌లను రిపేర్ చేయడంతో పాటు, విడిభాగాలను అందించడంలో విఫలమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు చెప్పారు. 

Go First ఆదాయాలు నిరంతరం తగ్గుతూ వచ్చాయి. ఇంజన్ల సరఫరా లోపం కారణంగా తగినంత విమానాలు లేకపోవడంతో ఆదాయం కూడా వేగంగా తగ్గింది. దీంతో విమానయాన సంస్థ సస్పెన్షన్‌పై గోఫాస్ట్‌కు DGCA నోటీసు పంపింది. 24 గంటల్లోగా విమానయాన సంస్థ నుంచి స్పందన కోరింది. అదే సమయంలో విమానయాన సంస్థను కాపాడేందుకు కృషి చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం విమానయాన సంస్థకు అన్ని విధాలుగా సహకరిస్తోందని మంత్రి సింధియా తెలిపారు.

click me!