నరేశ్ గోయల్ కపుల్‌కు షాక్: ఆబ్రాడ్ వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ బ్రేక్

By Siva KodatiFirst Published May 26, 2019, 11:19 AM IST
Highlights

ఆర్థిక సంక్షోభంతో మూలన బడ్డ జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ దంపతులు దేశం విడిచి వెళ్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దుబాయ్ మీదుగా లండన్ వెళ్లడానికి వీరు ప్రణాళికలు సిద్ధం చేశారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయెల్‌, ఆయన భార్య అనితా గోయెల్‌లకు ఎదురుదెబ్బ తగిలింది. దేశం విడిచివెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. శనివారం ఈ దంపతులు లండన్‌కు ప్రయాణం అయ్యారు. విమానం టేకాఫ్‌ కావడానికి కొద్ది నిమిషాల ముందు ముంబై విమానాశ్రయ ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. 

దుబాయి మీదుగా లండన్ వెళ్లేందుకు నరేశ్ గోయల్ దంపతులు ఎమిరేట్స్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈకే 507 విమానంలో అప్పటికే కూర్చున్నారు కూడా. అయితే ఆ విమానాన్ని తిరిగి పార్కింగ్‌ స్థలానికి పిలిపించి.. వీరిని కిందకు దించారు.

‘నరేశ్‌ గోయెల్‌, ఆయన భార్య అనిత లండన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే దేశం వదలివెళ్లకుండా వారిని అడ్డుకున్నాం’అని ఒక అధికారి పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. వీరి వెంట నాలుగు భారీ సూట్‌కేసులు కూడా ఉన్నాయి. 

‘చెక్డ్‌ ఇన్‌ బ్యాగేజీ(సూట్‌ కేసులు)పై అనితా గోయెల్‌ పేరు ఉంది. వాటిని కూడా వెనక్కి తెప్పించారు. దీంతో విమానం గంటకు పైగా ఆలస్యమైంది’ అని ఇమ్మిగ్రేషన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 3:35 గంటలకు టేకాఫ్‌ కావాల్సిన ఆ విమానం.. వీరిని కిందకు దించాక సాయంత్రం 5 గంటలకు వెళ్లింది.

కాగా, ఈ పరిణామాలపై స్పందించడానికి నరేశ్‌ గోయెల్‌ అందుబాటులోకి రాలేదు. సంబంధిత అధికారులకు సహకరించామని మాత్రమే ఎమిరేట్స్‌ శనివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో ఎమిరేట్స్‌ ప్రతినిధిని సంప్రదించినా ఎటువంటి స్పందనా రాలేదు. 

నరేశ్ గోయెల్‌ దంపతులను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం వెనక కారణం ఏమిటో ప్రస్తుతానికి తెలియరాలేదు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన మేరకు జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభంపై చర్చించడానికి ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌, హిందుజా గ్రూప్‌లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం కావడానికి నరేశ్‌ గోయెల్‌ లండన్‌కు వెళుతున్నారు.

జెట్‌ ఎయిర్వేస్ సంస్థలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు గత వారం హిందుజా గ్రూప్‌ వెల్లడించిన నేపథ్యంలో గోయెల్‌ ప్రయాణం చోటు చేసుకుంది.

చాలా నెలల నుంచి తమకు వేతనాలు చెల్లించనందున గోయెల్‌, ఇతర డైరెక్టర్ల పాస్‌పోర్ట్‌లను స్వాధృనం చేసుకోవాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికారుల, సిబ్బంది సంఘం అధ్యక్షుడు కిరణ్‌ పావస్కర్‌ ముంబై పోలీసు కమిషనర్‌కు ఏప్రిల్‌లో లేఖ రాసిన విషయం విదితమే.

click me!
Last Updated May 26, 2019, 11:19 AM IST
click me!