విషమించిన జైట్లీ ఆరోగ్యం! కార్పొరేట్, ఫైనాన్స్ మినిస్ట్రీలో టెన్షన్!!

By Siva KodatiFirst Published May 26, 2019, 11:06 AM IST
Highlights

కేంద్ర క్యాబినెట్‌లో కీలకమైన ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమిస్తోంది. మెరుగైన చికిత్స చేసేంకు లండన్‌కు తరలించాలని యోచించారు. అందుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబం వెనుకడుగు వేసింది

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (66) ఆరోగ్యం శనివారం మరింతగా విషమించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం 'ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌' (ఎయిమ్స్‌) నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి వ్యాధి పూర్తిగా నయం కాకున్నా గురువారమే ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జి చేయడం ఆర్థిక-కార్పొరేట్‌ వర్గాలను కలవరపెడుతోంది. 

అరుణ్ జైట్లీ శుక్రవారం ఆర్థిక శాఖ కీలక అధికారులను తన నివాసానికి పిలిపించుకుని దాదాపు గంట సేపు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. తర్వాత వారితో దిగిన గ్రూపు ఫొటోను ఆయన విడుదల చేయడంతో జైట్లీ ఆరోగ్యంగానే ఉన్నారన్న సందేశం దేశ ప్రజలకు చేరింది. 

అయినా వ్యాధి పూర్తిగా నయం కాకున్నా జైట్లీని ఎందుకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారనే అంశంపై సన్నిహితుల్లో ఆందోళన మాత్రం వ్యక్తం అవుతోంది.  ఆయనకు మరింత మెరుగైన చికిత్సను అందించే నిమిత్తం లండన్‌కు తరలించనున్నామని అరుణ్ జైట్లీ కుటుంబ సన్నిహితులు చెప్పారు. 

శనివారం ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వారు ఆ ప్రయత్నాలను పక్కనబెట్టినట్లు సమాచారం. జైట్లీ ఆరోగ్యం పరిస్థితి మరింతగా విషమించడంతో ఆయన కుమారుడి వివాహా ముహూర్తం ముందుకు జరుపి జూన్‌4న నిశ్చయించినట్టుగా సమాచారం. 

అనారోగ్యం వల్ల జైట్లీ ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి జైట్లీ ఆయనకు మంచి మిత్రుడిగా ఉన్నారు. మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఆయనకు మరింత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. 

బీజేపీలో మంచి ట్రబుల్‌ షూటర్‌గా కూడా ఆయనకు పేరుంది. కీలక వస్తు సేవల పన్నును (జీఎస్టీ) దేశ వ్యాప్తంగా అమలులోకి తెచ్చేందుకు ఆయన విపక్షాలతో స్వయంగా చర్చలు జరిపి ఆ బిల్లును పట్టాలెక్కించి ఘనత జైట్లీకే చెల్లుతుంది.

దీనికి తోడు జీఎస్టీ కౌన్సిల్‌ పేరుతో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి జీఎస్టీని ఒక కొలిక్కి తెచ్చేందుకు జైట్లీ కృషి ఎంతో ప్రశంసనీయమేనని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

click me!