కొచ్చర్‌ దంపతులపై మనీ లాండరింగ్ కేసు

By sivanagaprasad kodatiFirst Published Feb 3, 2019, 11:33 AM IST
Highlights

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్ మరో పిడుగు పడింది. ఇప్పటికే అశ్రిత పక్షపాతానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చందాకొచ్చర్ దంపతులతోపాటు వీడియో కాన్ చీఫ్ వేణుగోపాల్ ధూత్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ రుణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్ దంపతులపై మరో పిడుగు పడింది. తాజాగా ఆ దంపతులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ క్రిమినల్ కేసును నమోదు చేసింది. 

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లతోపాటు వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ మరికొందరిపై ఈ కేసును ఈడీ దాఖలు చేసింది. వీడియోకాన్‌కు బ్యాంక్ ఇచ్చిన రూ.1,875 కోట్ల రుణంలో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేసును నమోదు చేసినట్లు శనివారం ఈడీ వర్గాలు తెలిపాయి. 

గత నెల కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఓ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈడీ దాఖలు చేసిన ఈసీఐఆర్.. పోలీస్ ఎఫ్‌ఐఆర్‌కు సమానం. 

ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌లో పేర్లు ఉన్న వారికి త్వరలోనే సమన్లు జారీ కానున్నాయి. సీబీఐ కేసులో ఉన్నవారే ఈసీఐఆర్‌లోనూ ఉంటారని ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ కేసులో అక్రమాస్తుల సృష్టికి ఈ రుణాల ఒప్పందం కారణమైతే విచారణ చేస్తామని ఈడీ అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచ్చర్‌ సుమారు రూ.9 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలను కోల్పోనున్నారు. వీడియోకాన్‌ గ్రూపునకు రుణాల జారీలో చందా కొచ్చర్  బ్యాంకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు మాజీ జస్టిస్ జస్టిస్‌ శ్రీకృష్ట కమిటీ నిర్ధారించగానే గతంలో ఇచ్చిన బోనస్‌లు, పెండింగ్‌లో ఉన్నవి, ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలను సైతం రద్దు చేస్తామని బ్యాంకు బుధవారమే ప్రకటించింది.

బోనస్‌లతోపాటు అన్‌ఎక్సర్‌సైజ్డ్‌ స్టాక్‌ ఆప్షన్లనూ వదులుకోవాల్సి ఉంటుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. కాగా, చందాకొచ్చర్‌కు ఇప్పటిదాకా బ్యాంకు 94 లక్షల షేర్లను (స్టాక్‌ ఆప్షన్స్‌) బ్యాంకు మంజూరు చేసింది.  

వీటిలో ఎన్ని ఆమె వినియోగించుకున్నారనే సమాచారం లేదు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం చందాకొచర్‌కు ముట్టిన ఆర్థిక ప్రయోజనాలు రూ.340 కోట్ల మేర ఉంటాయని బ్యాంకు వర్గాల సమాచారం.
 

click me!