యూపీఏ హయాంలో దేశ ఆర్థిక ప్రగతి నిలిచిపోయింది..ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు..

By Krishna AdithyaFirst Published Sep 24, 2022, 12:14 PM IST
Highlights

యూపీఎ హయాంలో దేశ ఆర్థిక ప్రగతి నిలిచిపోయిందని, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు అంతే కాదు ప్రస్తుతం మోదీ హయాంలో దేశం చక్కటి అభివృద్ది చెందుతోందన్నారు. ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి యూపీఏ హయాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అసాధారణమైన వ్యక్తి అని కానీ దేశ ఆర్థిక కార్యకలాపాలు మాత్రం కొన్ని ప్రత్యేక కారణాలవల్ల నిలిచిపోయాయని నారాయణ మూర్తి అన్నారు. అహ్మదాబాద్ ఐఐఎం విద్యార్థులకు ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయని, ఆ హయాంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి  అన్నారు. ఆ రోజుల్లో అంతర్జాతీయ సమావేశాలలో చైనా పేరు ఎక్కువ సార్లు వినిపించేదని,  అదే సమయంలో, భారతదేశం పేరు చాలా అరుదుగా వినిపించేదని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో భారత్  ఆశలు చిగురించాయని అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - అహ్మదాబాద్ (IIM-A)లో యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో జరిపిన సంభాషణలో, భారతదేశ యువత దేశాన్ని చైనాకు తగిన పోటీదారుగా మార్చగలదని మూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

దశాబ్దం క్రితం ప్రపంచానికి చైనాపై నమ్మకం ఉండేది
ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడతూ.. నేను లండన్‌లోని HSBC బోర్డులో (2008 - 2012 మధ్య) ఉన్నానని చెప్పారు. ఈ సమయంలో, అంతకుముందు కొన్నేళ్లలో, బోర్డ్‌రూమ్‌లో (సమావేశాల సమయంలో) చైనాను రెండు మూడు సార్లు ప్రస్తావించినప్పుడు, భారతదేశం పేరు ఒక్కసారి మాత్రమే ముందుకు వచ్చేది.అయితే ఆ సమయంలో దురదృష్టవశాత్తు, భారతదేశంతో ఏమి జరిగిందో నాకు తెలియదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసాధారణమైన వ్యక్తి, ఆయనంటే నాకు చాలా గౌరవం. కానీ యూపీఏ హయాంలో భారతదేశం స్తంభించిపోయింది. ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. హెచ్‌ఎస్‌బిసి సమావేశాల్లో  చైనా పేరు దాదాపు 30 సార్లు ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే  నేడు ప్రపంచంలో భారత్‌ పట్ల గౌరవ భావన నెలకొందని, దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని మూర్తి అన్నారు.

ఇప్పుడు యువత బాధ్యత పెరిగింది
1991 నాటి ఆర్థిక సంస్కరణలు, నేటి మోదీ ప్రభుత్వ పథకాలైన మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు భారత్‌కు పెద్దపీట వేశాయని.. మూర్తి అన్నారు. ఎందుకంటే ఆ యుగంలో భారతదేశం నుండి యువత లేదా ప్రత్యేక అంచనాలు లేవు. చైనా కంటే భారత్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. 

click me!