సుంకాల పెంపుతో దిగుమతులు భారం

By Arun Kumar PFirst Published Oct 13, 2018, 10:35 AM IST
Highlights


టెలికం సంస్థలు వినియోగించే వస్తువుల దిగుమతిపైన 10 నుంచి 20 శాతం వరకు సుంకం విధిస్తూ సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) పేర్కొంది. అయితే టెల్కోలపై పది శాతం ఆర్థిక భారం పెరుగుతుందని అంచనా వేసింది.

న్యూఢిల్లీ: కరంట్ ఖాతా లోటు (క్యాడ్) నియంత్రణ కోసం టెక్నాలజీ వస్తువుల దిగుమతులపై సుంకాలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టెలీ కమ్యూనికేషన్ల రంగంపై 10 శాతం అదనపు ఆర్థిక భారం పడుతుందని టెలికం ఇండస్ట్రీ బాడీ సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (సీవోఏఐ) వ్యక్తం చేసింది. 

కమ్యూనికేషన్‌ రంగంలో ఉపయోగించే కొన్ని ఉత్పత్తులపై సుంకాలను పెంచడం వల్ల దిగుమతుల వ్యయం దాదాపు పది శాతం మేర పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో  సతమతం అవుతున్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతుందని పేర్కొంది. అయితే, దేశ ప్రయోజనాలు కాపాడేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని సీవోఏఐ తెలియజేసింది.

సాధారణంగా ఆపరేటర్లు ఏటా దాదాపు 8 బిలియన్‌ డాలర్ల విలువ చేసే నెట్‌వర్క్‌ పరికరాలను దిగుమతి చేసుకుంటారని, గత రెండు త్రైమాసికాల్లో దాదాపు 2–3 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు జరిగి ఉంటాయని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ తెలిపారు. కొత్తగా సుంకాల పెంపుతో దిగుమతుల వ్యయాలు 10 శాతం మేర పెరగవచ్చని చెప్పారు. 

బేస్‌ స్టేషన్స్‌ సహా కొన్ని కమ్యూనికేషన్స్‌, ట్రాన్స్ మిషన్, వాయిస్ రీ జనరేషన్, ఇమేజెస్, ఇతర డేటా మార్పిడికి ఉపయోగించే ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 20 శాతం దాకా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి రావడంతో మాథ్యూస్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

మోడెంలు, రూటర్లు, వాయిస్ ఫ్రీక్వెన్సీ టెలిగ్రఫీ, డిజిటల్ లూప్ క్యారియర్ సిస్టమ్స్, మల్టీప్లెక్సెస్ వంటి పరికరాల దిగుమతిపైనా 20 శాతం సుంకం విధించే అవకాశాలు ఉన్నాయి. అయితే దేశ ప్రయోజనాల కోసం టెలికం ఆపరేటర్లు పూర్తిస్థాయిలో పని చేస్తాయని సీఓఏఐ తెలిపింది. 
 

click me!