
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి సంవత్సరం 2014-15తో పోలిస్తే, 2023 నాటికి భారతీయుల సగటు తలసరి ఆదాయం రూ.1,72,000కు పెరిగింది. 2014-15లో భారతీయుల తలసరి ఆదాయం రూ.86,647 గా ఉండటం గమనార్హం. నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం తలసరి ఆదాయం 99 శాతం పెరుగుదల నమోదయ్యింది.
కానీ ఇది ప్రస్తుత ధరల ఆధారంగా పోల్చితే వాస్తవిక తలసరి ఆదాయం (ద్రవ్యోల్బణం తీసివేసిన తర్వాత) పెద్దగా పెరగలేదు. 2014-15లో వాస్తవ తలసరి ఆదాయం 72,805గా ఉంది. అదే ఇప్పుడు రూ.98,118కు చేరుకుందని ప్రముఖ అభివృద్ధి ఆర్థికవేత్త జయతీ ఘోష్ తెలిపారు. ద్రవ్యోల్బణం తగ్గితే, ఈ కాలంలో భారతీయుల తలసరి ఆదాయం 35 శాతం పెరిగి ఉండేదని అంచనా వేశారు.
తలసరి ఆదాయంలో పెరుగుదల ఎక్కువగా జనాభాలో 10 శాతం మందికి మాత్రమే జరిగిందని రిపోర్టులో తెలిపారు. అదే సమయంలో మధ్యతరగతి కుటుంబాల వేతనాలు పడిపోతున్నాయని అంచనా వేశారు. మధ్య తరగతి ప్రజల ఆదాయం వాస్తవ తలసరి ఆదాయం కంటే తక్కువగా ఉండవచ్చని ఆర్థికవేత్త జయతీ ఘోష్ అన్నారు. గణాంకాల ఏజెన్సీ రికార్డుల ప్రకారం, కోవిడ్ సమయంలో ప్రస్తుత , వాస్తవ తలసరి ఆదాయం రెండూ పడిపోయాయి. తర్వాతి సంవత్సరాల్లో రెండింటిలోనూ వృద్ధి కనిపించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఎకోరాప్ నివేదిక ప్రకారం భారతీయుల తలసరి జీడీపీ ఆదాయం రూ.1,96,716కి పెరిగింది. ఇది 2012లో రూ.71,609గా ఉంది. ఇది ప్రతి సంవత్సరం సగటున 10.6 శాతం పెరిగింది . ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ప్రకారం, భారతదేశం ఇప్పటికే బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇప్పుడు ప్రపంచంలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. దశాబ్దం క్రితం భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. కేవలం పదేళ్లలో ఆరు స్థానాలు ఎగబాకింది. ద్రవ్యోల్బణం తగ్గితే గత ఎనిమిదేళ్లలో భారతీయుల తలసరి ఆదాయం 35 శాతం పెరిగిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
పేదల ఆదాయం పెద్దగా పెరగలేదు కానీ
భారతీయుల తలసరి ఆదాయం పెరుగుతోంది. ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత వాస్తవ తలసరి ఆదాయం సైతం పెరిగింది. దేశం సుభిక్షంగా మారుతుందనడానికి ఇదే నిదర్శనం. కానీ దేశంలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి. అందువల్ల పేదల ఆదాయం పెద్దగా పెరగడం లేదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్, ప్రముఖ ఆర్థికవేత్త, నగేష్ కుమార్, పేర్కొన్నారు.