
ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్, ప్రముఖ ఎలక్రటిక్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఇబ్బందుల్లో పడ్డారు. ఏకంగా 258 బిలియన్ డాలర్ల పరువునష్టం దావాను ఎదుర్కొంటోన్నారు. క్రిప్టోకరెన్సీ ప్రమోషన్ వ్యవహారం ఆయనను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ దావాలో ఎలాన్ మస్క్‌తో పాటు స్పేస్ఎక్స్, టెస్లాలను కలిపి కూడా కలిపారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అపర కుబేరుడిగా పేరున్న ఎలాన్ మస్క్‌పై ఈ పరువు నష్టం దావాను వేసింది ఓ క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్. పేరు- కీత్ జాన్సన్. క్రిప్టోకరెన్సీ డోజ్ కాయిన్‌లో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టారు. కొద్దిరోజులుగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఏ రేంజ్‌లో పతనమౌతున్నదో మనకు తెలిసిన విషయమే. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడులకు ఎదుర్కొంటోందీ మధ్య.
ఆయా పరిస్థితుల వల్ల తాను పెద్ద ఎత్తున నష్టపోయానంటూ కీత్ జాన్సన్ వెల్లడించారు. డోజ్ కాయిన్ క్రిప్టోపిరమిడ్ స్కీమ్ వల్ల మోసపోయిన ఓ అమెరికన్ సిటిజన్ అంటూ తనపై తాను కామెంట్స్ చేసుకున్నారు. డోజ్ కాయిన్ విలువ పడిపోవడానికి స్పేస్ఎక్స్, టెస్లా కారణమనేది ఆయన ఆరోపణ. డోజ్ కాయిన్‌ను టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థలు విపరీతంగా ప్రమోట్ చేశాయని, వాటిని చూసే తాను అందులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టానని కీత్ జాన్సన్ చెప్పారు. ఈ మేరకు ఆయన మన్‌హట్టన్ ఫెడరల్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. 2019 నుంచీ డోజ్ కాయిన్ ద్వారా ఎలాంటి లాభాలు రావట్లేదని, ఆ విషయం తెలిసీ ఎలాన్ మస్క్ దీన్ని ప్రమోట్ చేశారని ఆరోపించారు.
క్రిప్టోకరెన్సీపై ఈ మధ్యకాలంలో వారెన్ బఫెట్, బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ పిటీషన్‌లో పొందుపరిచారు. ఈ ఇద్దరూ క్రిప్టోకరెన్సీని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డోజ్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల 2021 మే నుంచి ఇప్పటివరకు తాను 86 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు వివరించారు. కాగా- 2021లో టెస్లా కంపెనీ క్రిప్టోకరెన్సీకి అనుకూలంగా ఓ ప్రకటన చేసింది. కార్లను కొనుగోలు చేసిన వారు క్రిప్టోకరెన్సీ రూపంలో సొమ్మును కట్టడానికి అంగీకరించామని, 1.5 బిలియన్ డాలర్ల బిట్ కాయిన్లను తాము తీసుకున్నామంటూ అప్పట్లో టెస్లా ఓ ప్రకటన చేసింది. ఇప్పుడు కీత్ జాన్సన్.. దాన్ని కూడా తన పిటీషన్‌లో పొందుపరిచారు.