షెల్ కంపెనీల బాగోతం: నోట్ల రద్దు తర్వాత భారీగా డబ్బు డిపాజిట్.. ఆ పై విత్ డ్రా

First Published Aug 1, 2018, 12:33 PM IST
Highlights

పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగిన అవకతవకలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. డీమానిటైజేషన్ సమయంలో పెద్ద మొత్తంలో నల్లధనం బ్యాంకుల్లో జమ చేసి ఆ వెంటనే విత్ డ్రా చేసుకున్నట్టు అప్పుడు వచ్చిన ఆరోపణలు ఇప్పడు నిజమవుతున్నాయి.

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగిన అవకతవకలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. డీమానిటైజేషన్ సమయంలో పెద్ద మొత్తంలో నల్లధనం బ్యాంకుల్లో జమ చేసి ఆ వెంటనే విత్ డ్రా చేసుకున్నట్టు అప్పుడు వచ్చిన ఆరోపణలు ఇప్పడు నిజమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్న కంపెనీల బాగోతాలు బయట పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ అడ్రస్‌తో నమోదైన ఓ కంపెనీ ఏకంగా రూ. 3,178 కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నట్టు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తులో తేలింది. డొల్ల కంపెనీలపై చర్యలకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపక్రమించడంతో కూడా పలు సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భవిష్యత్‌లో మరెన్ని వింత కంపెనీలు, వింత స్కాములను చూడాల్సింది వస్తుందో వేచి చూడాల్సిందే.

పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.3,178 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసి తర్వాత ఉపసంహరించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ నకిలీ కంపెనీ లావాదేవీలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐవో) అధికారులు ఫోకస్ పెట్టారు. పెద్దనోట్ల రద్దు సమయంలో దేశవ్యాప్తంగా 18 కంపెనీలు వంద కోట్ల రూపాయలకుపైగా నగదును జమ చేసినట్లు కేంద్రం గుర్తించింది. ఆ కంపెనీలు సుమారు 9,945 కోట్ల నగదును బ్యాంకులలో జమచేసి ఆ తర్వాత అడ్డంగా ఉపసంహరించుకున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) పసిగట్టింది. 

ఈ క్రమంలో 2017, నవంబర్ 15వ తేదీన ఎస్‌ఎఫ్‌ఐవో విచారణకు ఎంసీఏ ఆదేశించింది. అడ్డంగా నగదు ఉపసంహరించుకున్న 18 సంస్థల్లో హైదరాబాద్ సంస్థలు మూడు ఉన్నాయి. ఇందులో రూ.3,178 కోట్లతో ఎర్రగడ్డ కేంద్రంగా నమోదైన డ్రీమ్‌లైన్ మ్యాన్‌పవర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందు వరుసలో ఉంది. ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ సమీపాన గల ఓ భవనంలోని ‘డోర్ నెంబర్ 8-4-548/1’ పేరుతో ఎంసీఏ వద్ద దీని చిరునామా నమోదైంది. ఈ సంస్థ తమ పేరును నిత్యాంక్ ఇన్‌ఫ్రాపవర్ అండ్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా తర్వాత మార్చుకున్నదని అధికారుల పరిశీలనలో తేలింది.

click me!