
ఓ వైపు స్టాక్ మార్కెట్లు పతనం అవుతుంటే, అదే బాటలో క్రిప్టో కరెన్సీలు కూడా తోడవుతున్నాయి. తాజాగా బిట్ కాయిన్ ఏకంగా 23 వేల డాలర్లకు పడిపోయింది. ఒకప్పుడు 53 లక్షల రూపాయలు పలికిన బిట్ కాయిన్ తాజాగా 18 లక్షలకు పడిపోయింది. అంటే ఏ రేంజులో పతనం ముంచుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
దీంతో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన వారికి రక్త కన్నీరు మిగిలిందనే చెప్పాలి. బిట్ కాయిన్ మాత్రమే కాదు టాప్ క్రిప్టో కరెన్సీలూ సైతం తమ వాల్యూలో కనీసం 30 శాతం పైగా నష్టపోయాయి. బిట్‌కాయిన్ చూస్తే క్రిప్టో వాల్యూ 23750 డాలర్ల (రూ. 18 లక్షల) కు దిగొచ్చింది. కిందటేడాది నవంబర్‌లో బిట్‌కాయిన్ వాల్యూ 68,990 డాలర్ల (రూ. 53 లక్షల) వద్ద ఆల్‌టైమ్ హైని టచ్ చేసింది. ప్రస్తుతం ఆ లెవెల్ నుంచి 60 శాతానికి పైగా నష్టపోయి ట్రేడవుతోంది. మార్కెట్ క్యాప్ ప్రకారం, రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయితే ఇథీరియం కూడా 1,200 డాలర్లకు పడింది.
రాయిటర్స్ సమాచారం ప్రకారం ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో భారీ పతనం ప్రారంభమైంది. సోమవారం, క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ జనవరి 2021 తర్వాత మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. CoinMarketCap నుండి వచ్చిన డేటా ప్రకారం, క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ 926 బిలియన్ డాలర్లకు తగ్గింది.
నవంబర్ 2021లో, గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్పుడు దాని మార్కెట్ విలువ దాదాపు 2.9 ట్రిలియన్ డాలర్లు. కానీ, ఈ సంవత్సరం క్రిప్టోకరెన్సీ స్థిరమైన క్షీణత కనిపిస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం , సెంట్రల్ బ్యాంకుల కీలక వడ్డీ రేట్ల పెంపుదల వల్ల వృద్ధి ప్రభావితమవుతుందని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అధిక-రిస్క్ ఉండే క్రిప్టో కరెన్సీ లాంటి ఆస్తులకు దూరంగా ఉండటంతో గత రెండు నెలల్లో దీని మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది.
బిట్‌కాయిన్ (Bitcoin)18 నెలల కనిష్టానికి చేరుకుంది
అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ (Bitcoin) సోమవారం 10 శాతానికి పైగా పడిపోయి, 18 నెలల కనిష్ట స్థాయి 23,750 డాలర్లకి చేరుకుంది. ఈ ఏడాది బిట్‌కాయిన్ (Bitcoin)50 శాతం వరకు నష్టపోయింది. ఇక Ethereum 1,210 డాలర్ల స్థాయికి 15 శాతం కంటే ఎక్కువ క్షీణించింది.
US ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది, UK ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది , బిట్‌కాయిన్ (Bitcoin)18 నెలల కనిష్టానికి చేరుకుంది. గ్లోబల్‌గా సెంట్రల్ బ్యాంకులు అన్నీ వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. దీంతో షేర్లు, క్రిప్టో కరెన్సీ లాంటి రిస్క్ ఉండే అసెట్స్ నుంచి ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు తీసేస్తున్నారు. బాండ్లు, గోల్డ్, డాలర్ వంటి సేఫ్ అసెట్స్ వైపు చూస్తున్నారు. అందుకే క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం అవుతున్నాయి. షేరు మార్కెట్లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఇప్పటిలో ముగిసేలా కనిపించడం లేదు. దీంతో అమెరికా, యూరప్ సహా గ్లోబల్ గా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటోంది. దీంతో క్రిప్టో అసెట్స్‌లో గ్రోత్ కనిపించడం లేదని చెప్పొచ్చు.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడులకు స్వర్గధామంగా పేర్కొనే గోల్డ్ వైపు పెట్టుబడులను తరలిస్తున్నారు.