కరోనా ఎఫెక్ట్: టీవీ,ఫ్రిజ్‌, ఏయిర్ కండిషనర్ల ధరలు ఇంకా పైపైకి

By narsimha lodeFirst Published Feb 21, 2020, 11:12 AM IST
Highlights

కరోనా వైరస్ ప్రభావంతో టీవీలు, ప్రిజ్ లు, ఏసీ ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం చైనా ఉత్పాదక రంగాన్ని నిస్తేజం కమ్మేసింది. టీవీల్లో వినియోగించే ఓపెన్‌ సెల్‌ టెలివిజన్‌ ప్యానెల్స్‌ సరఫరాకు అంతరాయాన్ని కలిగిస్తున్నది. భారత్‌కు దిగుమతి అవుతున్న ఓపెన్‌ సెల్‌ టెలివిజన్‌ ప్యానెల్స్‌లో చైనా నుంచే ఎక్కువగా వస్తున్నాయి. 

కోవిడ్-19 ప్రభావంతో ఉత్పత్తి నిలిచిపోవడంతో చైనా నుంచి ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానెళ్ల సరఫరా ఆగిపోయింది. తత్ఫలితంగా దేశీయంగా టీవీల తయారీకి ఆటంకం కలిగిస్తున్నది. మార్కెట్‌ డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేక అందుబాటులో ఉన్న ప్యానెల్స్‌ ధరలు పెరిగిపోయే వీలుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో టీవీల ధరలూ పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ప్యానెల్స్‌.. టీవీ ధరలో దాదాపు 60 శాతంగా ఉండటం గమనార్హం. అయితే చైనాలో కొన్ని కర్మాగారాలు తిరిగి తెరుచుకున్నా పరిమిత స్థాయి కార్మికులతోనే నడుస్తున్నాయి.

Also read:భాగ్యనగరిలో పసిడి ధర @43 వేలు..మిగతా చోట్ల కాసింత బెటరే

దీంతో ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరుగడం లేదని, వీటివల్ల మార్కెట్‌లో ప్యానెల్‌ ధర దాదాపు 20 శాతం పెరుగవచ్చని పరిశ్రమ అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో మార్చిలో కనీసం టీవీల ధరలు 10 శాతమైనా పెరుగడం ఖాయమని ఎస్‌పీపీఎల్‌ సీఈవో అవ్ నీత్‌ సింగ్‌ మర్వా అన్నారు. భారతదేశ డిమాండ్ కు అనుగుణంగా చైనాలో ప్యానెళ్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని పునరుద్ధరించాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుందన్నారు.

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా 30-50 శాతం వరకు ఉత్పత్తి పడిపోయే వీలుందని కూడా ఎస్‌పీపీఎల్‌ సీఈవో అవ్ నీత్‌ సింగ్‌ మర్వా చెప్పారు. హైయర్‌ ఇండియా అధ్యక్షుడు ఎరిక్‌ బ్రగాంజా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ఇప్పటికే డీప్‌ ఫ్రీజర్ల ధరలు 2.5 శాతం మేర పెరిగాయి. రిఫ్రిజిరేటర్‌, ఎయిర్‌ కండీషనర్‌ల ధరల్లో పెరుగుదల ఉండవచ్చని పరిశ్రమ అంటున్నది. టీవీలతోపటు రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల ధరలు కూడా పెరుగుతాయని హయ్యర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాన్జా తెలిపారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లకు సంబంధించిన కంప్రెషర్లను దేశీయ సంస్థలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి మరి. 
 

click me!