ముకేశ్ అంబానీకి ఎదురుదెబ్బ: 2 నెలల్లో రూ.37 వేల కోట్ల నష్టం

By telugu news teamFirst Published Feb 29, 2020, 12:08 PM IST
Highlights

కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలతోపాటు కుబేరులు, సంపన్నులు కూడా విలవిల లాడుతున్నారు. గత రెండు నెలల్లో అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద రూ.37 వేల కోట్ల మేరకు కోల్పోవడానికి కరోనా వైరస్సే కారణం. ఇంకా ఆదిత్య కుమార మంగళం బిర్లా, గౌతం ఆదానీ, ఉదయ్ కోటక్ తదితర కుబేరుల సంపద హరించుకుపోయింది.

కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. చివరకు కుబేరుల సంపద ఐస్ క్రీమ్ లా కరిగిపోతూనే ఉంది. ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకీ కొత్త ఏడాదిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ముకేశ్ అంబానీ రెండు నెలల్లోనే రూ. 37 వేల కోట్ల సంపదను నష్టపోయారు. ఇందులోనూ ఎక్కువ భాగం గడిచిన 15 రోజుల్లోనే నష్టం వాటిల్లింది. ఈ అపర కుబేరుడిని చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారీగా దెబ్బకొట్టిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

2020 నూతన సంవత్సరం ప్రారంభం నాటికి అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద రూ. 4.12 లక్షల కోట్లుగా ఉండేది. కానీ, 2019 డిసెంబర్ చివరిలో చైనా వుహాన్ సిటీలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ కొద్ది రోజులకే ప్రపంచం మొత్తాన్ని వణికించేసింది. సంక్రాంతి సమయానికి కొత్త వైరస్ పలు దేశాలకు పాకింది.

గ్లోబల్‌గా ఎకానమీ స్లో డౌన్ నడస్తున్న ఇదే సమయంలో చైనాలో అన్ని పరిశ్రమలు ఒక్కసారిగా దాదాపుగా మూతపడిన పరిస్థితి నెలకొంది. కరోనా ఎఫెక్ట్‌తో మార్కెట్లలో వణుకు మొదలైంది. దీంతో ముందు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు తమ స్టాక్ హాల్డింగ్స్‌ను గంపగుత్తగా అమ్మకానికి దిగారు. కరోనా ఎఫెక్ట్‌తో మార్కెట్ల పతనం శుక్రవారం కూడా కనిపించింది. రూ.10 లక్షల కోట్ల సంపద ఒక్కరోజులోనే ఆవిరైపోయింది.

మార్కెట్ రిస్క్ భయంతో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల సంపదను నష్టపోయారని బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ తెలిపింది. దీంతో గడిచిన రెండు నెలల్లో రిలయన్స్ ఏకంగా 11 శాతం సంపదను నష్టపోయిందని చెప్పింది. కరోనా ఎఫెక్ట్‌తో భారీగా దెబ్బపడిందని, రూ.37 వేల కోట్ల నష్టపోయి.. 3.48 లక్షల కోట్ల సంపద మిగిలింది. ఇక భారత ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ విప్రో సంస్థ ఈ రెండు నెలల్లో రూ. 6,303 కోట్లు నష్టపోయింది.

కరోనా వైరస్‌ దెబ్బతో ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార మంగళం బిర్లా రూ.6,374 కోట్లు (884 మిలియన్‌ డాలర్లు), అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ 496 మిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. వీరితోపాటు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చీఫ్‌ ఉదయ్‌ కొటక్‌, సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ కూడా భారీగా నష్టపోయారు. 

ఈ నెల 12 నుంచి 11 సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3 వేల పాయింట్ల వరకు క్షీణించింది. దీంతో మదుపరుల సంపద రూ.11.52 లక్షల కోట్లు కరిగిపోయింది. టాటా గ్రూపునకు చెందిన 21 కంపెనీలు నికరంగా రూ.41,390 కోట్ల సంపదను కోల్పోగా.. అదానీ గ్రూపు రూ.27,100 కోట్లు, ఆదిత్యా బిర్లా గ్రూపు రూ.17,500 కోట్లు, వాడియా గ్రూపు రూ.3,300 కోట్లు నష్టపోయినట్టు బ్లూంబర్గ్‌ వెల్లడించింది. 
 

click me!