జూన్ దాకా లాక్‌డౌన్?: 30% రిటైల్ బిజినెస్ మూత.. 18 లక్షల జాబ్స్ హాంఫట్!

By narsimha lodeFirst Published Mar 29, 2020, 3:13 PM IST
Highlights

దేశంలో గత నెల ప్రారంభంలో మొదలైన కరోనా మహమ్మారి (కోవిడ్-19) సంక్షోభంతో దేశీయంగా పలు వ్యాపార సంస్థలు గణనీయంగా కీణించాయి. 

న్యూఢిల్లీ: దేశంలో గత నెల ప్రారంభంలో మొదలైన కరోనా మహమ్మారి (కోవిడ్-19) సంక్షోభంతో దేశీయంగా పలు వ్యాపార సంస్థలు గణనీయంగా కీణించాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాల ఆదాయం భారీగా దెబ్బ తిన్నది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్ పరిస్థితులు మున్ముందు కూడా కొనసాగితే 30 శాతం మోడ్రన్ దుకాణాలు మూత పడతాయని, 18 లక్షల మంది ఉపాధి కోల్పోతారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనా వైరస్ ప్రభావంతో లాక్ కొనసాగడం వల్ల ప్రతి మూడు రిటైల్ ఔట్‌లెట్లకు ఒకటి మూత పడటం ఖాయంగా కనిపిస్తున్నది. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరికల్లా వ్యాపారం 20-25 శాతం పడిపోయింది. లాక్ డౌన్‌తో ఈ నష్టాలు మరింత విస్తరించాయి. 

భారతదేశంలో 15 లక్షలకు పైగా ఉన్న ఆధునిక రిటైల్ దుకాణాల ద్వారా ఏటా రూ.4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. దాదాపు 60 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గత 45 రోజుల్లోనే వ్యాపారం 15 శాతానికి తగ్గింది. లాక్ డౌన్ సమయంలో తెరిచి ఉంచడానికి అనుమతించిన అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణాలకు నష్టాలు తప్పడం లేదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఇతర సాధారణ సరుకులను విక్రయించడానికి అనుమతి లేకపోవడంతో ఆయా సంస్థలు నష్టాలను చవి చూస్తున్నాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. మొత్తంమీద, దుస్తులు, ఆభరణాలు, బూట్లు (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఐటీ, టెలిఫోన్లు) రిటైల్‌ రంగ బిజినెస్‌పై గణనీయ ప్రభావం చూపిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ చెప్పారు.

జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే, 30 శాతం రిటైల్ దుకాణాలను మూసివేసే పరిస్థితి వస్తుందని, దీనివల్ల 18 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని కుమార్ రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సింగపూర్, కెనడా,  అమెరికా ప్రభుత్వాల మాదిరిగానే రిటైల్ పరిశ్రమకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని రిటైల్ సంస్థల యాజమాన్యాలు కోరుతున్నాయి.

దీనిపై భారత ప్రభుత్వానికి లేఖ రాశామని రాజగోపాలన్ చెప్పారు.  అలాగే  తమ కంపెనీల్లో చాలా మంది  చిల్లర వ్యాపారులు తమ ఉద్యోగులకు 35-40 రోజుల చెల్లింపు సెలవు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పామని, లాక్ డౌన్ సమయంలో వారికి వేతనం లభించేలా చూస్తామని వీ-మార్ట్ రిటైల్ సీఎండీ లలిత్ అగర్వాల్ చెప్పారు.

ఉద్యోగులకు జీతాల భరోసా ఇవ్వడంతోపాటు, సంస్థ తన అమ్మకందారులకు మద్దతుగా రూ .1.5 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే ఎండీ కవి మిశ్రా చెప్పారు. ఒకవేళ ఏప్రిల్ తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగితే రిటైల్ బిజినెస్ మూసివేత అంచుకు చేరుకుంటుందని కవి మిశ్రా తెలిపారు. 

click me!